అక్షరకేళి:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
తల తలుపులు
తెరుచుకున్నాయి
తట్టెడు తలపులు
త్రోసుకొనివచ్చాయి

విచిత్ర భావాలు
వానలా చిందాయి
విభిన్న విషయాలు
నదిలా పారాయి

అక్షరాలు
పక్షుల్లా ఎగిరాయి
పదాలు
పూలతల్లా ప్రాకాయి

పువ్వుల్లా
అందంగా అల్లుకున్నాయి
దండల్లా
ఆనందంగా తయారయ్యాయి

నవ్వులై
మోముల ఆక్రమించాయి
వెలుగులై
కాంతులు విరజిమ్మాయి

తేనెలా
నాలుకనుచేరాయి
సుధలా
పెదవులనంటుకున్నాయి

స్వరాలై
మధుర రాగాలుతీసాయి
శబ్దాలై
వీనులకు విందునిచ్చాయి

ముత్యాలై
మదిని మురిపించాయి
రత్నాలై
హృదిన రవళించాయి

కవితలై
కాగితలకు ఎక్కాయి
కావ్యాలై
కవ్వింపులకు దిగాయి

శిశువై
చిందులు వేయిస్తున్నాయి
కన్యకై
కుతూహల పరుస్తున్నాయి

మధువై
మత్తు ఎక్కిస్తున్నాయి
వధువై
వినోదము అందిస్తున్నాయి

అక్షరాల ఆట 
పరికించాలి
పదాల బాట 
పట్టాలి

అక్షరాలే
ఆత్మీయం
పదాలే
ప్రాణనీయం

భావమే
బంధం
కవనమే
విఙ్ఞానం


కామెంట్‌లు