కఫాలా:-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 బ్రతుకు తెరువుకు దేశమొదిలి కాయకష్టం చేసే 
కార్మికుల పాలిటి కరకు పెత్తనం వారిది.
కన్నవారిని,కట్టుకున్న వారినొదిలి,పిల్లజెల్లల బాగుకై
తపించిపోయే వలసకార్మికులకు మృత్యుశాపమది.
యజమానుల రూపంలోని‌
నరరూపరాక్షసుల నయాచిత్రమది.
కూడు తినక కూడబెట్టి,
వెట్టి చాకిరికి దొరికి,
చట్టాల చట్రంలో ఇరికిపోతారు.
మానవత్వపు జాడ కనబడక,
కర్కశత్వపు క్రూరహింసలకు బలై,
తోడు లేక,నీడ కానరాక,
తమ వారికై పరితపిస్తారు.
ఒంటెల కన్నా హీనంగా చూడబడి,
పీనుగులై జీవిస్తారు.
కఫాలాల పదఘట్టనల కింద నలిగిపోయి,
మాయమైపోతారు.
నమ్మకంగా పనిచేసినా, నయవంచనకు గురై,
ఆత్మలు క్షోభించి,
చిత్తరువులై నిలుస్తారు.
మాటలు పడి మనసులు కోల్పోయి,
దెబ్బలు తిని మానం హరించబడి,
తెలివిదప్పి,దిక్కు తెలియక,
నలిగి,మలిగిపోయి,జీవితాన్ని‌
తాకట్టు పెడతారు.
కఫాలాల కపాలాలకు అర్థం కాని కన్నీళ్ళు కారుస్తూ,
నిత్యనరకంలో నిరంతరాయంగా జీవిస్తారు.
కఫాలా కాఫిర్లకు చిక్కిన మేకపిల్లలోలె బలిపీఠాలెక్కుతారు.
కామెంట్‌లు