శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - వ్యాఖ్యానము - భాగం - 13
 "సౌభాగ్యభాస్కరం" - శ్రీ భాస్కరరాయలు గారు.
సృష్టి రహస్యాలను చూపించినది - "బ్రహ్మాండ పురాణం"
"బ్రహ్మాండ పురాణం" లోని"ఉపాఖ్యానాలు" - దేవకార్యాలను సవివరంగా చెప్తాయి - ఆ ఉపాఖ్యానాలలో ఒకటి శ్రీలలిత ఉపాఖ్యానము.
అగస్త్య మహాముని - శ్రీమహావిష్ణువు చేత సమర్ధుడు గా పొగడబడ్డ, మహా తపస్వి. శ్రీవిద్య ఉపాసించిన వారిలో, అగస్త్య మహాముని గొప్ప వాడు. అతి పూజనీయుడు.
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం..... మనంమందరమూ, మన చిన్నతనంలో....మన అమ్మమ్మలు, నాన్నమ్మ ల దగ్గరనుంచి, మనకు అన్నం తినిపించిన ప్రతీసారీ, ఎక్కువగా విన్న వాక్యం. ఇది ఎలా వచ్చింది......పురాణకథ చూద్దాం.....
ఇల్వలుడు, వాతాపి ఇద్దరూ రాక్షసులు. అన్నదమ్ములు. ఇల్వలుడు పెద్దవాడు. వాతాపి తమ్ముడు. రాక్షసులు వారు కోరుకున్న రూపం ధరించగలుగుతారు కదా. ఇది మనకు తెలుసు. ఈ అన్నదమ్ములు, అడవిలో నివసిస్తూ ఉండేవారు. వీరికి ఆకలి వేసినప్పుడు, వారు వుంటున్న అడవి గుండా వెళ్ళే సన్యాసులను, మునీశ్వరులను, బ్రాహ్మణ వేషంలో వుండి, వారి ఇంటికి భోజనానికి పిలిచేవారు.
ఇల్వలుడు, తమ్ముడు వాతాపిని మేకగా మార్చి, కూర వండి, మునీశ్వరులకు భోజనం పెట్టేవాడు. ఆ మునీశ్వరులు భుక్తాయాసంతో విశ్రాంతి తీసుకునేటప్పుడు, ఇల్వలుడు " ఒరేయ్! వాతాపి! ఎక్కడ వున్నావురా. త్వరగా రా! ఆకలి వేస్తోంది! భోజనం చేద్దాము" అని పిలిచేవాడు. వాతాపి, మేక రూపంలో కూరగా మారి మునీశ్వరుల పొట్టలో వున్నాడు, కదా!. మునీశ్వరుని పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేవాడు. చనిపోయిన మునిని, అన్నదమ్ములు ఇద్దరూ ఆహారంగా తినేవారు. ఇది, వారి నిత్యకృత్యం.
ఆ అడవి చుట్టు ప్రక్కల ఉన్న మునీశ్వరులకు, ప్రజలకు అడవి దారిలో వెళ్ళాలంటే, చాలా భయానకంగా వుండేది, ఎదురవబోయే మృత్యువును తలచుకుని.  తమని ఈ ఆపద నుండి కాపాడగలిగే వాడు, అగస్త్య మహాముని ఒక్కరే, అని తెలుసుకుంటారు. ఆ మహనీయుని చేరి, రాక్షస అన్నదమ్ముల నుండి తమను కాపాడమని, ప్రాధేయపడుతూ.....అర్ధించారు.



దయాహృదయుడైన అగస్త్యుడు, సరే అని, అడవి మార్గంలో ప్రయాణం మొదలుపెట్టాడు. కొంత సేపటికి, బ్రాహ్మణులు కనపడ్డారు... భోజనానికి పిలిచారు... వాతాపి మేక కూరగా వండబడ్డాడు.... అగస్త్యుని భోజనం పూర్తి అయ్యింది. తన పొట్ట మీద కుడి అరచేతిని వుంచి, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని మూడు సార్లు చెప్పి ప్రశాంతంగా విశ్రమించాడు, అగస్త్యుడు.
తమకు భోజనం సమయం అయింది, అని వాతాపిని పిలుస్తున్నాడు ఇల్వలుడు. మేక రూపంలో కూర అయిన వాతాపి, జీర్ణం అయి, అగస్త్యుని రక్తం లో కలిసిపోయాడు. అన్న పిలుపు వినబడదు. బయటకు రాలేడు. ఎన్ని సార్లు పిలిచినా, తమ్ముడు రావట్లేదు. విషయం అర్ధం చేసుకున్న ఇల్వలుడు, తన రాక్షస రూపంతో అగస్త్యుని కాళ్ళమీద పడి, తమ తప్పు ఒప్పుకున్నాడు. తన తమ్ముడు వాతాపిని బ్రతికించమని కాళ్ళావేళ్ళా పడ్డాడు.
"ఇప్పటి నుండి బుద్ధి కలిగి వుండి, అడవి దారిలో వెళ్ళే మునీశ్వరులను, సామాన్యులను బాధించకుండా వుంటాము" అని మాట ఇస్తే, వాని తమ్ముని బ్రతికిస్తాను అని చెప్తాడు, అగస్త్యుడు. "బుద్ధి! బుద్ధి! ఎవరినీ బాధపెట్టము, చంపము" అని మాట ఇస్తాడు ఇల్వలుడు. వాతాపిని బ్రతికిస్తాడు అగస్త్యుడు.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు