ఆది పర్వము- షష్టమాశ్వాసము
* 35 వ రోజు*
ఏకచక్రపురం బకాసురవధ
శాలిహోత్రుని ఆశ్రమంలో పాండవులు ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రాలు అభ్యసించారు. ఆ తరువాత వారు జింక చర్మాలు నార చీరలు ధరించి వేద పఠనం చేస్తూ బ్రాహ్మణ వేషాలలో ఏకచక్ర పురం అనే అగ్రహారం చేరారు. ఒక బ్రాహ్మణిని ఇంట్లో నివాసం ఏర్పరచు కున్నారు. పాండవులు ప్రతి రోజు మౌనంగా భిక్ష స్వీకరించి తల్లికి ఇచ్చేవారు. కుంతీ దేవి ఆభిక్షలో సగం భీమునికి పెట్టి సగం మిగిలిన నలుగురు కుమారులతో చేరి భుజిస్తూ వచ్చింది. సహృదుయులు, సత్ప్రవర్తనులు అయిన వారిని చూసి అగ్రహార ప్రజలు ఆనందించారు. ఒక రోజు భీముడు ఇంట్లో ఉన్నాడు మిగిలిన వారు భిక్ష స్వీకరించటానికి వెళ్ళారు. ఆ సమయంలో ఆ ఇంటిలో రోదనలు వినపడ్డాయి. కుంతీ దేవి భీమునితో " భీమసేనా ఈ ఇంటి వారికి ఏదో కష్టం కలిగి నట్లుంది. వీరు చేసిన ఉపకారం గుర్తించడం పుణ్యం ప్రత్యుపకారం మరింత పుణ్యం చేసిన దానికంటే అధిక ఉపకారం చేయడం ఉత్తమ పుణ్యం" అని చెప్పింది. భీమసేనుడు తల్లితో " అమ్మా నీ ఆజ్ఞను నెరవేరుస్తాను. నీవు వారిని అడిగి వారికి ఏమి కష్టం వచ్చిందో చెప్పావంటే నేను వారికి ప్రత్యుపకారం చేస్తాను" అన్నాడు.
బ్రాహ్మణ కుటుంబం విలపించుట
కుంతీ దేవితో ఆ ఇంటి యజమాని " అమ్మా జననం మరణం సంయోగం వియోగం సహజమే అయినా వేదోక్తంగా వివాహం చేకున్న భార్యను కాని కన్యాదానం చేసి అత్త వారిటికి పంపవలసిన కూతురుని కాని, నాకూ నా పితృలకు పిండోదకాలు ఇవ్వవలసిన నా కుమారుని కానీ రాక్షసునికి ఆహారంగా పంప లేక నేనే ఆహారంగా వెళతానని చెప్పాను అందుకు వీరు సమ్మతించక విలపిస్తున్నారు " అన్నాడు. అందుకు భార్య "నాధా మిమ్మల్ని వివాహమాడి సంతాన ప్రాప్తి కలిగించాను. భర్త కంటే ముందు మరణించి పుణ్య లోకాలకు వెళతాను. భర్త లేని భార్య లోకంలే అవమానాలు భరిస్తూ కష్టపడవలసి వస్తుంది. మీరు వేరు వివాహం చేసుకుని పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించి ప్రయోజకులను చెయ్యండి. నేను ఆహారంగా వెళతాను" అన్నది. అంతలో కూతురు " అమ్మా నేను వివాహం చేసుకుని మీకు మనుమలను ఇచ్చేకంటే నేనే ఆహారంగా వెళతాను. మీరు జీవించి ఉంటే సంతానాన్ని పొందవచ్చు" అన్నది. ఇంతలో చిన్న వాడైన కుమారుడు కర్ర తీసుకుని " తండ్రీ! నేను వెళ్ళి ఆ రాక్షసుని చంపుతానని " అన్నాడు.
బకాసురుడి వృత్తాంతం విని కుంతి బ్రాహ్మణుడికి అభయమిచ్చుట
కుంతీ దేవి " రాక్షసుడు ఎవరు? మీరు అతడికి ఆహారంగా ఎందుకు వెళ్ళాలి? నాకు వివరించండి " అడిగింది. అందుకు సమాధానంగా బ్రాహ్మణుడు " అమ్మా ఇక్కడకు ఆమడ దూరంలో యమునా నదీ తీరాన బకాసరుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు గ్రామం మీద పడి అందరినీ తిన సాగాడు. అందువలన మేమంతా అతడితో రోజుకు ఒకడు వాడికి ఆహారంగా వెళ్ళాలని ఒప్పందం కుదుర్చు కున్నాము. ప్రతి రోజూ ఒక బండి ఆహారం, రెండు దున్నపోతులు, ఒక మనిషి ఆతడికి ఆహారంగా వెళ్ళాలి ఈ దేశాన్ని ఏలే రాజుకు కూడా వాడిని ఎదిరించే శక్తి లేక మిన్న కున్నాడు. ఈ రోజు ఈ ఇంటి నుండి అతడికి ఆహారంగా వెళ్ళాలి " అన్నాడు. అందుకు కుంతీ దేవి " అయ్యా ! చింతించ వలదు మీకు ఒక్కడే కుమారుడు. నాకు ఐదుగురు ఉన్నారు. నా కుమారులలో ఒకడిని పంపుతాను " అన్నది. ఆ బ్రాహ్మణుడు కుంతీ దేవితో " అమ్మా! అతిథిని పంపుట తగదు అందునా బ్రాహ్మణ హత్య మహాపాపం " అన్నాడు. కుంతీ దేవి " అయ్యా ! ఆలోచించ వద్దు నా కుమారుడు మహా బలవంతుడు అతడు ఇంతకు ముందు రాక్షసులను చంపాడు. అంతడు తప్పక బకుని చంపి వస్తాడు " అన్నది. ఆమె భీమునితో జరిగినది అంతా చెప్పింది. అందుకు భీముడు సంతోషంగా అంగీకరించాడు
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి