ఏడు కొండల నుదుట
తిలకమై వెలిగేవాడా...ఓ వెంకటేశా..!
ఎన్నో మెట్లెక్కి...ఎన్నో పూజలు చేసి
నిన్ను వెతికే భక్తుల్ని చూడవేమయ్యా...
నీవు మౌనంగా ఉన్నా...
నీ మౌనమే మాకు మంత్రదండం కాదా...?
నమో వెంకటేశా...
నమో తిరుమలేశా...
నమో నమో శ్రీ వేంకటేశా...అంటూ
మరో భక్తుడు పరవశంగా పాడుతుంటే...
పారే పాతాళ గంగ వీచే గాలి
తరులు గిరులు అన్నీ ముక్తకంఠంతో
నీ గోవిందనామాన్ని స్మరిస్తున్నాయి...!
అదిగో...అల్లదిగో...
కనువిందు చేసే శ్రీ హరివాసము...
శేషశైల శిఖరాలపై కాంతి పరచిన
పదివేల శేషుల పడగలమయమూ...!
గోవిందా హరి గోవిందా...
వెంకట రమణ గోవిందా...
గోవిందా హరి గోవిందా...
శ్రీ వెంకటేశా గోవిందా...!
అంటూ నీ భక్తబృందం
పరవశంతో చేసేను నీ నామ సంకీర్తన..!
దిక్కులు దద్దరిల్లేలా...
ప్రకృతి పరవశించేలా...
ప్రపంచమంతా నీ పరమ
పవిత్రనామం ప్రతిధ్వనించేలా...
నీ దివ్యమంగళ రూపదర్శనంతో...
భక్తి తరంగాల్లో తేలిపోతూ...
నీకు తలనీలాలు సమర్పించి...
నీ గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసి...
మడికట్టి పొర్లు దండాలు పెట్టి...
నీ ఒక్క చల్లనిచూపుతో
కోటి "వరాలవర్షం" కురుస్తుందని...
నీ కరుణా కటాక్ష వీక్షణాల కోసం
తపిస్తోంది నీ భక్తకోటి జనం...
ఓ కోనేటిరాయా! నీకు కోటిదండాలయ్యా.!
ఓ వెంకటేశా...!
నీ అభయహస్తాల స్పర్శతో
మా బ్రతుకుల్లోని అంధకారాన్ని
అరిష్టాల మబ్బుల్ని కరిగించుమయా..!
మా మదిలోని అరిషడ్వర్గాల
నీలి నీడల్ని తొలగించుమయా...!
ఓ తిరుమలేశా...!
మా కళ్ళల్లో కాంతి
శాంతిదీపాలను వెలిగించుమయా..!
మా జీవన మార్గంలో
ధర్మదీప్తిని నిండుగా నింపుమయా..!
ఓ శ్రీనివాసా...!
మా హృదయాలలో
ప్రేమ పరిమళాలను వెదజల్లుమయా..!
మా జీవితలతలకు జాలి దయ
కరుణాకుసుమాలను పూయించుమయా.!
ఓ కోనేటిరాయా...!
త్యాగం అనురాగం అనే తేనెచుక్కలతో
మా మనసులను తడుపుమయా..!
ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు అనే
అమృత బిందువులతో
మా బ్రతుకుల్ని నింపుమయా...!
ఓ సప్తగిరి నివాసా...!
సమస్యల సుడిగుండాల్లో
చిక్కుకున్న మా జీవితనావలను
ఆనందతీరాలకు చేర్చుమయా...!
కోటి "వరాలవర్షం" కురిపించే
ఓ కోనేటి రాయుడా...!
నీ కరుణే మాకు...దారి దీపం..!
నీ ప్రేమే మాకు...అమృత వర్షం..!
నీ దయే మాకు...దివ్య దిక్సూచి..!
ఓ ఏడు కొండలవాడా..!
ఓ వెంకట రమణా..! గోవిందా గోవిందా..!


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి