సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 ఆది పర్వము సప్తమాశ్వాసము సమాప్తం- 44 వ రోజు
ద్రౌపది పూర్వజన్మల వృత్తాంతం
వ్యాసుడు దృపదుడితో " దృపదమహారాజా ! పూర్వం మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన మహా పతివ్రత. మౌద్గల్యుడు కుష్టురోగంతో బాధ పడుతున్నాడు. అయినా అసహ్యించు కోకుండా సేవలు చేస్తుంది. ఒక రోజు భర్తకు భోజనం పెట్టి మిగిలిన అన్నం తింటూ ఉన్నప్పుడు అందులో భర్త వేలు ఊడిపడి ఉండటం చూసి అది పక్కన పెట్టి మిగిలిన అన్నం తింటూ ఉంది. ఇది చూసి మౌద్గల్యుడు ఆశ్చర్య పోయాడు. " ఇంద్రసేనా ! నీ పతి భక్తి అమోఘం. నీకు ఏమి వరం కావాలో కోరుకో ఇస్తాను " అన్నాడు. " నాధా ! నాకు వాంఛలు తీరలేదు. అందుకు మీ రూపం అందుకు అడ్డు వస్తుంది. మీరు అందమైన ఐదు రూపాలుగా మారి నా కోరికలను తీర్చండి " అని అడిగింది. అందుకు అంగీకరించిన మౌద్గల్యుడు మనోహరమైన ఐదు రూపాలు ధరించి భార్య కోరిక తీర్చాడు. తరువాత అతడూ బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కానీ కోరికలు తీరని ఇంద్రసేన మరు జన్మలో కాశీరాజు కూమార్తెగా జన్మించింది. ఆమె చాలా కాలం కన్యగా మిగిలి పోయింది. శివుని గురించి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అన్నాడు. శివుని చూసిన ఇంద్రసేన తన మనసులోని బలవత్తరమైన కోరికతో శివుని చూసిన తత్తరపాటుతో " నాకు భర్త కావాలి " అని అయిదు సార్లు చెప్పింది. శివుడు ఆమెతో " తధాస్థు మరు జన్మలో నీకు ఐదుగురు భర్తలు లభిస్తారు " అన్నాడు. అది విని ఆమె తన పొరపాటు గ్రహించింది. " దేవా ! ఒక కన్యకు ఐదుగురు భర్తలు లభించటం లోక విరుద్ధం కాదా నాకు ఈ వరం వద్దు " అన్నది. అందుకు శివుడు " సాధ్వీ నీవు ఐదుగురు భర్తలతో ధర్మబద్ధం అయిన కాపురం చేస్తావు " అన్నాడు. అలా ఐతే నాకు నిరంతర పతి సేవాభాగ్యం కావాలి . నాకు ఒక్కొక్కరితో ఏకాంత జీవితం కావాలి. కన్యాత్వం చెడకుండా కాపురం కావాలి " అని అడిగింది. శివుడు ఆమె కోరిన విధంగా వరాలు ఇచ్చాడు. " నువ్వు వెళ్ళి గంగా తీరంలో ఉన్న ఇంద్రుడిని తీసుకురా " అన్నాడు. ఆ సమయంలో యమ ధర్మరాజు సత్ర యాగం చేస్తున్నాడు. యాగ దీక్షలో ఉన్నాడు కాబట్టి ప్రాణి హింస చేయలేదు. లోకంలో మరణాలు తగ్గి భూభారం ఎక్కువైంది. ఇంద్రాది దేవతలు బ్రహ్మ లోకానికి వెళ్ళి " దేవా మరణం లేకుంటే మానవులకు మాకు తేడా ఏమిటి? అందుకు తరుణోపాయం తమరే చెప్పాలి " అన్నారు. అందుకు బ్రహ్మ దేవుడు " యముని సత్ర యాగం ముగిసే దాకా మీరు నిశ్చింతగా ఉండండి. ఆ తరువాత అతడు మానవులను అంతమొందిస్తాడు. మీ తేజస్సు, యముని తేజస్సుతో పుట్టిన వీరులు ఆయనకు సహాయంగా ఉంటారు " అన్నాడు. దేవతలు ఇంద్రలోకం వెళుతూ గంగా తీరంలో ఏడుస్తున్నకాశీరాజు కూతురిని చూసాడు. ఇంద్రుడు " ఎందుకు ఏడుస్తున్నావు " అని అడిగాడు. ఆమె " అది తెలిసుకోవాలంటే నా వెంట రావాలి " అని శివుని దగ్గరికి తీసుకు వెళ్ళింది. ఆ సమయంలో శివుడు ఒక యువతితో పాచిక లాడుతున్నాడు. ఇంద్రుడు " ముల్లోకాలకు అధిపతిని నాముందు జూదం ఆడుతావేమి? " అని అహంకారంతో అన్నాడు. అందుకు శివుడు కోపించి " గర్వంతో మాట్లాడకు నీకు చేతనైతే ఆకొండ గుహను చీల్చు" అన్నాడు. ఇంద్రుడు సరేనని గుహను చీల్చగానే తనలాంటి నలుగురిని చూసి ఆశ్చర్య పోయాడు. శివుడు నిజరూపం ధరించి " మీ ఐదుగురు ఇంద్రులు మానవ లోకంలో జన్మించండి. కాశీ రాజ పుత్రిక మానవ కాంతగా జన్మించి మీకు భార్య అవుతుంది " అన్నాడు. వ్యాసుడు " దృపద మహారాజా ఆ ఐదుగురు ఇంద్రులే పాండవులు. కాశీ రాజు కుమార్తె నీ ఇంట పెరుగుతున్న యజ్ఞసేని. నీకు అనుమానం అయితే వారి నిజరూపాలు చూడు" అని తన తపో మహిమతో వారి రూపాలు చూపగా. వెలుగుతున్న వారి నిజరూపాలను చూసాడు. వ్యాసుడు " దృపదా ! పూర్వం నితంతుడు అనే రాజర్షి కుమారులు కూడా ఔశీనర పుత్రికను స్వయంవరంలో గెలిచి వివాహ మాడారు. కనుక నీ కూతురిని పాండవులకిచ్చి వివాహం జరిపించు " అన్నాడు.
ద్రౌపదితో పాండుసుతుల వివాహం
వ్యాసుని మాటలతో దృపదుని సందేహం తీరింది. ద్రౌపదిని పాండవులకు ఇవ్వడానికి సమ్మతించాడు. పాడవుల తరఫున ధౌమ్యుడు పౌరోహిత్యం వహించాడు. సర్వాలంకార భూషిత అయిన ద్రౌపదిని ముందుగా వేదోక్తంగా ధర్మరాజుకు ఇచ్చి వివాహం చేయించారు. తరువాత పరమ శివుని ప్రార్థించగానే తిరిగి కన్యాత్వం సిద్ధించింది. ఆ తరువాత భీమసేనునికి ఆ తరువాత అర్జునినికి ఆ తరువాత నకుల సహదేవులకు వేదోక్తంగా వివాహం జరిపించారు. ఆపై కుంతీ దేవి ఆశీర్వాదం పొంది ఆపై పెద్దల ఆశీర్వాదం పొందారు.
ఆది పర్వము సప్తమాశ్వాసము సమాప్తం

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు