సుప్రభాత కవిత : - బృంద
కాలం జరిపిన దాడిలో 
కలలు కొట్టుకుపోగా 
కనపడే వంకర గీతలు 
కనపడని తలరాతలు

తీరం కోసం తీరని తపనల
దారం తెగిన గాలిపటాలు 
వేగం తగ్గాక విదితమయే 
వేదాంతపు వివరాలు

అహం పొంగులో దూకుళ్ళు
ఆనందమని పొరబడ్డ మెదళ్ళు
అణిగాక  తెరచుకునే 
అధఃపాతాళపు వాకిళ్ళు

దారి తప్పిన జీవితాలు
నారి విడచిన బాణాలు
గురిని చేరు దారేదో
గురుతే రాని అగమ్యాలు

కుమిలిపోయే కలతలైన 
కుంగిపోయే వెతలైనా 
కాలం విసిరిన జాలంలో 
కలిసిపోక తప్పదు

సమయంతో సహగమనం 
సహనంతో  సంయమనం 
సన్మార్గపు స్వధర్మంతో   
సాగిపోవడం ధన్యం!

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు