సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు,ఖమ్మం
 సామెత -38: అందరికీ శకునం చెప్పే బల్లి -కుడితి తొట్లో పడ్డట్టు
****
"ఇగ్గో అవ్వా! గీ యిసయం దెల్సిందా? పండరి సామికి టక్కరైందట.ఆల్లీళ్ళు జూసి దవాఖానాల శెరీక జేసిండ్రంట.
"అయ్యో! గట్లెట్ల టక్కరైంది పద్దుమా! టక్కర్ జేషినోన్ని పట్టుకుండ్రా!గాన్ని ఇయ్యరమయ్యర నాల్గు సప్పరిచ్చి పోలీస్లకు బట్టించిండ్రా? గిసొంటోళ్లు జేబట్టే  ఉచ్చితార్థంగా పానాలు బోతున్నయి. బండినడ్పేటప్పుడు ఒళ్ళు సోవి వుండదా? టీవీల దినాము ఎక్కన్నో ఓకాడ గివ్వే జూసుడైతున్నది."
"అవునవ్వా!బైట్కెళ్ళినోల్లు ఇంట్లె అడుగు బెట్టేదాకా నమ్మకమే ఉంటల్లే. అయితే.. అయితే... అసలు సంగతి జెప్పనా అవ్వా !గీ టక్కర్ మన పండరిసామే జేసిండంట.పోను చెవిల బెట్కొని ఎవలితోనో మాట్లాడుకుంట ఎర్రబల్పు ఎల్గింది సుత సూడకుండ సర్రున బొయ్యి ఎదురుంగోడ్ని గుద్దిండంట. గాయ్న కాళ్ళు,ఎన్కాల ఆడమనిషి చెయ్యిరిగినయంట. పొద్దున్నే ఎవులి మొకం జూసిండ్రో గని! గాళ్ల గాచారం బాగుంది.లేచినేల మంచిగుంది.లేకుంటెనా... "
 "అవునా పద్దుమా! "అందరికీ శకునం చెప్పే బల్లి కుడిత్తొట్లో బడ్డట్టు" గీయన పతొక్కరికి  వోరం వొర్జమని శకునం జెప్తడు గద.మరి గాయ్నకు సోయి దెల్వదా? గవ్వన్ని జూస్కోలేదా? అయినా గిదేం పొయ్యే కాలమే పద్దుమా? గా పోను చెవిల బెట్కొని బండి నడ్పుడేంది? గా బండి కాకుండ ఏ లారో బస్సో కింద పడ్తె ఇంగేమన్నుందా?"
 గా సైమంలో ఎవలో అడిగితే శకునమే జెప్తుండట అవ్వా!"
 "బాగనే ఉంది కత. గట్ల జెప్పేటోడికి కూసింతైన బుద్ధి గ్యానెం ఉండొద్దా?గిప్పటిదనక పది మందికి మంచి శెడు జెప్పిండు. ఇంగిప్పుడెవరైనా గాయన్ని నమ్ముతరా?
"అవునే అవ్వా!ఇంగాయన బత్కు కుడ్తిల బడ్డ బల్లొతికెనే. సావు దప్పి కన్ను లొట్టబోయినట్టుంది. గాయన్ని తంతం చేత్తమంటే మనోల్లే ఆపి నయాన బయాన జెప్పి ఓ పదేలు వైద్గానికి ఇప్పించి పంపిండ్రంట.
"రేప్పొద్దుగాల! బొయ్యి జూశొద్దాం పెళ్ళాం పిల్లల్ని పల్కరిచ్చొద్దాం" అన్న అవ్వ మాటల్కి సరే నని తలూపింది పద్దుమ ( పద్మ).
గదండీ సంగతి! "అందరికీ శకునం చెప్పే బల్లి-కుడితి తొట్లో పడ్డట్టు" ఒకరికి నీతులు జెప్పేటప్పుడు గవి మనంగూడ పాటించాలి గద.లేకపోతే గిట్లనే ఉంటది.

కామెంట్‌లు