పువ్వుల వాన...నవ్వుల నావ :- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్.
ఓ మిత్రమా..!

నా ప్రియ నేస్తమా..!
ఈ జీవితం...
ఒక పువ్వుల వాన..!
ఒక నవ్వుల నావ...!
ఎగిసే అలల మధ్య
ఒక ఆశల యాత్ర...
నీడలా సాగే నిత్యసంఘర్షణ..!

ఈ జీవితం...
ఊగే ఒక ఊహల ఉయ్యాల...
ఆలోచనల ఆకాశంలో
తేలిపోయే ఒక నీలి మేఘం...
ఈ జీవితం...మెరుస్తూ క్షణంలో
కరిగిపోయే ఒక నీటి బుడగ...
కానీ ఆ క్షణమే ఒక జీవన సత్యం..!

ఈ జీవితం...
ఒక పోరాటం...
ఒక ఆశల ఆరాటం...
నవ్వుల వెనక 
నిరాశలు నిట్టూర్పులు..!
కన్నీటి వెనక 
చిగురించే చిరునవ్వులు..!

ఓ మిత్రమా తెలుసుకో
ఈ జీవిత సత్యాలు...
ఈ మాయా మర్మాలు...
ఆ పరమాత్మ లీలల తత్త్వాలు..!

ఈ జీవిత నాటకరంగంలో
ఓ మిత్రమా..! నీవొక పాత్రధారి..!
ఆ సృష్టికర్త...! ఒక సూత్రధారి....!
ఆయన చేతిలో మనం ఆటబొమ్మలం...!

తెలుసుకొని
మలచుకో నీ జీవితాన్ని...
సుస్వరాల సుమధుర గీతంలా..!
గాన గంధర్వులు
ఆలపించే అమృత రాగంలా..!
మనసును తాకే మధుర వాణిలా...!
కవి కలంలోంచి జాలువారే కావ్యంలా..!

నీ జీవితం మారాలి..!
అందమైన అజంతా శిల్పంలా..!
అపురూపమైన కళాఖండంలా..!

కామెంట్‌లు