సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు, ఖమ్మం
 

సామెత -50:-అరువు సొమ్ములు బరువుల చేటు,తీయాబెట్టా తీపుల చేటు,దాంట్లకేలి ఒకటిపోయిన అప్పుల చేటు
***
"ఒద్దే మాలచ్మి.నువ్వే సొక్కం బంగారం లెక్కున్నవ్.గీ తేప నించి పంట మీద వొచ్చిన లాభంతో ఏడాదికొక్క నగ చేయిత్తనే అని ఒక్క తీర్గ బుదగరిచ్చి చెప్పిండు నా కొడుకు.
ఇంటె గద! అసలే మా పుట్టింటోళ్ళ తరుపు పెళ్ళి. "నీకేందే మాలచ్మి! పొలాలు,శెల్కలు మస్తుగున్నయి.పంటలు సుత మంచిగ పండుతున్నయ్.నౌకర్లు చాకర్లు అదృట్టమంటె నీదేనే  అంటుంటరు. గస్మంటోళ్ళ పెండ్లికి ఎల్లెటప్పుడు ఎట్లుండాలె.మన అయిషతుకు దగ్గట్టు పోవాల్నా? వద్దా? అన్కుంట నన్ను వాన్ని ఎకరదిచ్చి మూలమీదున్న ముత్తేలమ్మ కోడలి గీ మద్దెనే చేయించుకున్న కంట్లారం, పెద్ద గొలుసు,పాపెట బిళ్ళ,ఇంగేమో యాద్కి రాట్లే అవ్వా! గవన్ని దెచ్చుకుందంట.
 "ఇంతకీ ఏమైందొదినే! సొమ్ములు ఏమన్న బొయినయా ఏంది?
ఏమేం బొయినయో చెప్తదా ఏంది? వొచ్చిన ఒక్కటే ఏడ్వబట్టింది. ఎవలన్న సూత్తె  నన్ను "ఈ అత్త ఏమారళ్ళు బెడ్తుందో అన్కోరా అవ్వా! ఆడూ, నేను శిలక్కి జెప్పినట్టు జెప్పినం.అంతకైతే నా కాసుల పేరు ఏస్కొని బోవే అని సుత జెప్పిన.గది ఇంటెనా. ఎన్కటోళ్ళు ఏసుకునేది.వద్దత్తా! అంది.గిప్పుడనిపిత్తుంది. గదసలే పత్తులాలు.ఏస్కబోందే నయమైంది తీ!"
అవునొదినే! అయినగని నాకు తెల్వకడుగుత.గీ కాలంల పతొక్కరు గిల్టు నగలు, ఒక్క గాము బంగారం గొలుసులు తీరొక్కవి కొనుక్కుని ఏసుకుంటుండ్రు.గీ పిల్ల బుద్దేడ్కి బోయింది. గందుకే మన పెద్దోళ్ళు ఊకెనే అన్లే."అరువు సొమ్ములు బరువుల చేటు తీయాబెట్టా తీపుల చేటు- దాంట్లకేలి ఒకటిపోయిన అప్పుల చేటని. గట్ల తీయంగ బెట్టంగ ఎవలో దొంగబుద్ది ఉన్నోళ్ళు జూసుంటరు.పొయ్యుంటై. ఇంతకి ఏమేం బొయినయో ... ఎవలి కానుంచైన గిట్ల దెచ్చుకునేప్పుడు.సెల్లుల పుటువ దీసి బెట్కోవాలె. ఆళ్ళకి, మనకి మంచిది.ఏమైన తేడా వొత్తే సుబూదు గదే జెప్తది. గదన్నడుగు వొదినా! రంధి జేయకు. ఈ దెబ్బతో బుద్దొత్తుంది.ఇంకోపాలి చెయ్యద్ తీ!"
అవునవ్వా! తశ్వీరు దీసిందో లేదో తెల్సుకుంట.గిప్పుడు బంగారం ఎంత పిరమైందో తెల్సి సుత మా కోడలు పొల్ల గింత పన్జేసింది. పైసలు ఊకెనే వత్తాయి.  లెక్క గట్టి ఎన్ని గట్టాల్నో ఏమో! గీ బాద నీతో పంచుకొని బోదమని వొచ్చిన. అన్కుంట బోతున్న లలితొదినొంక జూస్కుంట "ఎగసాయంల రెక్కలు ముక్కలు జేస్కుంటెనే మంచి పంట పండి నాల్గు పైసలు కళ్ళజూత్తం" అన్కుంట పనిల జొరబడ్డది.
గదండీ సంగతి! "అరువు సొమ్ములు బరువుల చేటు, తీయాబెట్టా తీపుల చేటు- దాంట్లకేలి ఒకటిపోయిన అప్పుల చేటు"అంటే గిదే మరి
కామెంట్‌లు