సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 ఆది పర్వము సప్తమాశ్వాసము: - 39 వ రోజు
విశ్వామిత్రుడి మత్సరం
తపస్సు వలన దివ్యశక్తులు సాధించినా విశ్వామిత్రునికి వశిష్టునిపై మత్సరం పోలేదు. వశిష్ఠుడు కల్మషపాదునికి యాజకుడుగా చేస్తున్నాడు. విశ్వామిత్రునకు కూడా కల్మషపాదునికి యాజకునిగా ఉండాలని ఉండేది. ఒక రోజు కల్మషపాదుడు వేటకు వెళ్ళి తిరిగి వస్తున్న తరుణంలో వశిష్టుని పెద్ద కుమారుడు శక్తి మహర్షి ఎదురు పడ్డాడు. రాజు శక్తితో ! పక్కకు తొలగి నాకు దారి ఇవ్వు " అని అడిగాడు. శక్తి " మహారాజా ! ఎంతటి వారైనా బ్రాహ్మణుడు ఎదురైతే ముందుగా తొలగి దారి ఇవ్వడం ధర్మం " అని చెప్పాడు. రాజు ఆగ్రహించి చేతి కర్రతో శక్తిని కొట్టాడు. శక్తి కోపించి " రాజా ! రాక్షసుడిలా నన్ను కొట్టావు కనుక రాక్షసుడివై నరమాంస భక్షకుడివైపో " అని శపించాడు. అప్పుడు కళ్ళు తెరచిన కల్మషపాదుడు శాపవిమోచనం ఇవ్వమని వేడు కున్నాడు. దూరంగా ఇదంతా గమనిస్తున్న విశ్వామిత్రుడు కల్మషపాదునిలో కింకరుడు అనే రాక్షసుని ప్రవేశపెట్టాడు. అప్పటి నుండి కల్మషపాదుడు రాచకార్యాలు మానివేసాడు. ఒక రోజు ఒక బ్రాహ్మణుడు కల్మషపాదుని మాంసాహారం పెట్టించమని అడిగాడు. అప్పటికి సరేనని ఆ తరవార మరచి పోయినా రాత్రికి గుర్తు వచ్చి వంటవాడిని పిలిచి ఆ బ్రాహ్మణునికి మాంసాహార భోజనం పెట్టమన్నాడు. వంటవాడు ఆ సమయంలో మాంసం లభ్యం కాదని చెప్పాడు రాజు ఆవేశంతో నరమాంసం అయినా పెట్టమన్నాడు. వంటవాడు నరమాంసం వండి ఆ బ్రాహ్మణునికి పెట్టాడు. తాను తిన్నది నరమాంసం అని గ్రహించిన బ్రాహ్మణుడు " కల్మషపాదుని చూసి నాచేత నరమాంసం భుజింప చేసావు కనుక నీవు రాక్షసుడవై నరమాంసం తింటూ జీవించు " అని శపించాడు. కల్మషపాదుడు వెంటనే రాక్షసుడైనాడు. వెంటనే శక్తి దగ్గరకు వెళ్ళి " దీనికంతా కారణం నీవే కనుక ముందు నిన్నే భక్షిస్తాను " అని చెప్పి అతనితో చేరి వశిష్టుని నూరుగురు కుమారులను భక్షించాడు.
వశిష్టుడి ఆత్మహత్యా ప్రయత్నము
తన నూరుగురు కుమారులు చనిపోవడం సహించలేని వశిష్ఠుడు ఆత్మహత్యకు పాల్పడ పోతుండగా శక్తి భార్య అదృశ్యవంతి గర్భస్థ శిశువు సుస్వరంతో వేదాలను వల్లించడం విన్నాడు. వశిష్ఠుడు మనుమని చూడాలని ఆశతో ఆత్మహత్యా ప్రయత్నం మానుకున్నాడు. ఒక రోజు కల్మషపాదుడు అదృశ్యవంతిని భక్షింపబోయాడు. వశిష్ఠుడు అతనిపై మంత్ర జలం చల్లాడు. వెంటనే కల్మషపాదునికి రాక్షసత్వం పోయి శాప విముక్తుడు అ య్యాడు. వశిష్ఠుడు కల్మషపాదునితో " బ్రాహ్మణులను అవమానిస్తే వచ్చే అనర్ధం తెలుసింది కదా ఇక మీదట బ్రాహ్మణులను పూజించు " అని హితభోధ చేసాడు. రాక్షసునిగా ఉన్న సమయంలో కల్మాషపాదుడు ప్రణయకాలాపంలో ఉన్న బ్రాణుని చంపి తిన్నాడు. బ్రాహ్మణుని భార్య కోపించి " ప్రణయకాలాపంలో ఉన్న నా భర్తను చంపావు కనుక నీవు స్త్రీతో ప్రణయకాలాపం చేస్తే మరణిస్తావు " అని శపించింది. అందువలన కల్మాషపాదుడు సంతానం పొందలేక పోయాడు. సంతానం కావాలనే కోరిక అధికం కావడంతో వశిష్టుని వద్దకు వచ్చి తనకు సంతానం ప్రసాదించమని వేడుకున్నాడు. వశిష్ఠుడు అందుకు అంగీకరించాడు. కల్మాషపాదుని భార్య మదయంతి యందు సంతానం కలిగేలా అనుగ్రహించాడు. మదయంతి గర్భం ధరించింది. పన్నెండేళ్ళు గడచినా ప్రసవం కానందున ఆమె పదునన రాతితో గర్భాన్ని చీల్చుకుంది. ఆమెకు అశ్మకుడు అనే రాజర్షి జన్మించాడు. అదే సమయంలో శక్తి భార్య అదృశ్యంతికి పరాశరుడు జన్మించాడు. అతడు తల్లి వలన తన తండ్రిని ఒక రాక్షసుని వలన మరణించాడని విని ఆగ్రహం చెంది లోకాలను భస్మం చేస్తానని శపథం చేసాడు. అది విని వశిష్ఠుడు అతనిని వారించాడు.

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు