గ్రంథాలయాన కొరవే సభ్యుల కవి సమ్మేళనం

 మండల కేంద్రంలో గల శాఖా గ్రంథాలయంలో కొత్తూరు రచయితల వేదిక సభ్యులచే కవి సమ్మేళనం నిర్వహించామని గ్రంథాలయాధికారిణి తెంబూరు ఇందిర తెలిపారు. తొలుత గ్రంథాలయ ఉద్యమ ప్రముఖులు ఎస్.ఆర్.రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకట రమణయ్యల చిత్రపటాలకు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి, నివాళులర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వివిజిఎస్ శంకరరావు నిర్దేశాలమేరకు, ఏభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా నేడు జరిపిన సాహిత్య సమ్మేళనంలో రచయితలు వినిపించిన కవితలు సామాజిక స్పృహకు అద్దం పట్టాయని, అందరినీ ఆలోచింపజేసాయని ఇందిర ప్రశంసించారు. కొత్తూరు రచయితల వేదిక గౌరవాధ్యక్షులు పెద్దిన కులశేఖర ఆల్వార్ సమన్వయంతో జరిగిన కవి సమ్మేళనంలో ప్రధాన కార్యదర్శి అమ్మల కామేశ్వరి, ఉపాధ్యక్షులు ముదిల శంకరరావు, సహకార్యదర్శి గడసాపు ఉషారాణి, కార్యవర్గ సభ్యులు బాణాన రమణమూర్తి, గజివిల్లి మోహనరావు తదితరులు తమ కవితలను వినిపించారు. గ్రంథాలయాధికారిణి టి.ఇందిర మాట్లాడుతూ ఆంధ్రనాట గ్రంథాలయ ఉద్యమం ఎంతో విశిష్టత పొందిందని, దేశంలో ప్రప్రథమంగా గ్రంథాలయాలకు ప్రత్యేక చట్టం ఏర్పాటుకు ఆంధ్ర వారోత్సవాల గ్రంథాలయోద్యమాలే స్పూర్తి అని అన్నారు. కొత్తూరు రచయితల వేదిక గౌరవాధ్యక్షులు పెద్దిన కులశేఖర ఆల్వార్ మాట్లాడుతూ గ్రంథాలయాలు అందరికీ విజ్ఞానాన్ని, మానవతా విలువలను, ఆద్యాత్మిక భావనలు, సమాజ పోకడలు అందిస్తున్నాయని అన్నారు.  గ్రంథాలయ ఉద్యమకారులు రంగనాథన్, నాగభూషణం, వెంకట రమణయ్యల సేవలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం, పాటల పోటీల్లో విజేతలైన చిన్నారులు బన్నీ, రిషిక, ఆషా, లోహిత్, మోహిని, జ్యోతి, బాలులకు బహుమతులు అందజేశారు.  అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు