సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు,ఖమ్మం

 సామెత -41"అన్నిట్ల ఉన్నవు దాసరి- కన్నెట్ల బోయింది దాసరి" అన్నట్లు
*****
"అవ్వా! గా సుందరమన్న కొడుకున్నడు జూడు.గాని తెల్వి మామూలు తెల్వి గాదటవ్వా! మస్తు తెలివి మంతుడని అన్కోంగ యిన్న. ఆడు సద్వుల సద్వుల ఉండంట.బల్లె సార్లు గిట్ల జెపితె గట్ల అంట్కబోతడంట. బొమ్మలే గీత్తడట.పయోగాలని గవేంటేంటో జేత్తడంట. అమ్మ నాయినకి సద్వు లేకున్న గానికి బాగనే అంటింది.'పిల్లగాండ్లంటె గట్ల నా కొడుకు లెక్క ఉండాలె.సద్వాలె అని గాని అమ్మ నాయిన మురుసుడే మురుసుడు."
" నిజవే శెల్లె పోరలు గట్ల సదూకుంటె అమ్మ నాయినకు గంతకన్న సంబురం ఇంకేముంటది.  "ఒసే భూలచ్మీ! ఒరేయ్ బుడ్డోడా! అత్త ఏం జెప్పిందో యిన్నరు గద. గా అన్న లెక్క మీరు సుత సద్వాలె."
"మరే! మరే  యియ్యాల గా యన్నని మా బల్లె సార్లు మస్తు తిట్టిండ్రు. పెద్ద సారైతె "అన్నింట్ల ఉన్నవ్ బాగనె వుంది గని పరీక్షల గివేం మార్కులు.సద్వి చెప్పంగనె సరిపోయిందా?పరీక్షలు సరిగ్గ రాయొద్దా?గదేం రాత రా కొంగల్దొక్కిన మడుగోలే  గిట్లనే రాస్తె పెద్ద పరీక్షల పోతవురరేయ్ అన్నరు.
ఓష్నీ! గా మదు గాని కత" అన్నిట్ల ఉన్నవ్ దాసరి - కన్నెట్ల బోయింది దాసరి" అన్న తీర్గ ఉందన్న మాట.గన్ని తెల్వి తేటలున్నోడికి గా మాత్రం సోవి లేదా?సదువుడెంత ముక్కెమో రాసుడు సుత గంతే ముక్కెం గద!కుదిరిచ్చి సక్కంగ రాయాలె. గాంధీ తాత సుత సిన్నప్పుడు రాత సరింగ నేర్సుకోలేక పోయిన్నని పెద్దయినంక మస్తు రంధి పడ్డడట."
అవ్వా! అవ్వా! మా సారు కరడాల కాపీల దినాం రాయిత్తుండె. మంచిగ కుదిరిచ్చి రాసినోళ్ళకి గుడ్లు ఏత్తున్నడు.నాకు బోలెడు గుడ్లొచ్చినయ్! బుడ్డోడు అంటుంటే...
నాకు సుత వొచ్చినయ్ తీ. అవ్వా! అవ్వా! "అన్నింట్ల ఉన్నవ్ దాసరి- కన్నెట్ల బోయింది దాసరి" అంటేందే...
"మదు గాని లెక్కనే గా దాసరికి అన్ని విద్దెలు వొచ్చట,మస్తు తెల్వి ఉందట గని పంజేసేటప్పుడు కన్ను బోగొట్టుకుండట.అన్ని తెలిసినోడివి గట్లెట్ల బోగొట్టుకున్నవు.జాగర్త పడొద్దా! అన్కుంట అందరూ గీ సామెత అనడం షురూ జేసిండ్రు.  గందుకే అన్ని తెల్సుకునుడే గాదు.దేనప్పుడు ఎట్లుండాల్నో గా తెల్వి సుత ఉండాల్నె.సమజైందా?
"ఓ అయ్యింది గా మదన్న లెక్క ,గీ దాసరి లెక్క అస్సలుండొద్దు గదవ్వా?"
"నాకు సుత సమజైందవ్వా! గీ యిసయం సుందరయ్యన్న  చెవిల ఏస్త. కొడుక్కి జెప్పుకుంటడు" అన్కుంట అక్కన్నించి కదిలింది చంద్రమ్మ.
గదండీ సంగతి! "అన్నింట్ల ఉన్నవ్ దాసరి- కన్నెట్ల బోయింది దాసరి " అంటే గిదే మరి. ఎన్ని తెలివి తేటలు ఉన్నా అవసరమైన సమయంలో ఎలా మసలుకోవాలో, ఏం చేయాలో తెలియక పోతే అలాగే ఉంటుంది. 
కామెంట్‌లు