ఆట : -సరికొండ శ్రీనివాసరాజు
 క్రికెట్ పోటీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ప్రత్యర్థి జట్టు 50 ఓవర్లలో 204 పరుగులు చేసింది. మన లక్ష్యం 205 స్వల్ప లక్ష్యం. ఈజీగా గెలుస్తాం అని ప్రేక్షకులు అంతా భావించారు. ఆట చూస్తున్నారు. ఆట మొదలైంది. ఓపెనర్లు ఇద్దరూ చాలా జిడ్డుగా ఆడుతున్నారు. 15 ఓవర్లు ముగిసేసరికి మన జట్టు స్కోరు 24/0. ఆ తర్వాత ఇద్దరూ ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మన్ ఒకరి వెనుక ఒకరు లైన్ కడుతూ టపా టపా ఔట్ అవుతున్నారు. 40 ఓవర్లు ముగిసేసరికి మన స్కోరు 78/9. ఈ దశలో బ్యాటింగుకు వచ్చారు రంగ, రాము. ఇద్దరూ బద్ధ శత్రువులు. ఒకరికి ఒకరు ఎదురుపడితే చంపుకోవాలన్నంత భయంకరమైన శత్రువులు. మ్యాచ్ ఓటమి ఖాయం అని చాలామంది ప్రేక్షకులు స్టేడియం విడిచి వెళ్లినారు. 
     ఆ సమయంలో కూడా ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. రాము ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడుతున్నాడు. రంగ తాను ఔట్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా రంగ సింగిల్స్ తీస్తూ రాముకు స్ట్రైకింగ్ ఇస్తున్నాడు. ఇద్దరూ శత్రువులుగా ఉన్నా జట్టు కోసం ఒకరికి ఒకరు సహకరించుకుంటూ జట్టును అవలీలగా గెలిపించారు. విన్నింగ్ షాట్ కొట్టగానే ఇద్దరూ సంతోషం తట్టుకోలేక ఒకరిని ఒకరు గట్టిగా కౌగిలించుకున్నారు. 
     మిగిలిన ఆటగాళ్ళు సిగ్గుపడ్డారు. ఫైనల్ ఆటకు ముందు ప్రాక్టీస్ పక్కన పెట్టి, ఆ మహా నగరంలో షాపింగ్స్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసినారు. వీరిద్దరూ తలా ఒకచోట స్థానిక ఆటగాళ్ళతో కలసి ప్రాక్టీస్ చేసినారు. ఎంతో పట్టుదలతో ఆట గెలిపించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా రామును ప్రకటించారు. "నేను ఒక్కడినే కాదు, ఇద్దరం ఈ అవార్డుకు అర్హులం." అన్నాడు రాము. రాము, రంగ ప్రాణ మిత్రులు అయ్యారు. 

కామెంట్‌లు