అది ఆట కాదు - పులుల వేట..!కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
ముంబైలోని డీవై పాటిల్ క్రికెట్ 
స్టేడియం సోమవారం రాత్రి 
జనసముద్రంతో మోత మోగింది…
మువ్వన్నెల జెండా రెపరెపలాడింది…
మన భరత మాత ముద్దుబిడ్డలు
విజయగర్వంతో
పొంగి పోయారు...
గాల్లో తేలిపోయారు...
విహంగాలై విహరించారు...

భారతీయుల నలభై ఏడేళ్ల...
“ప్రపంచ మహిళా క్రికెట్ కప్”
"కమ్మని కల…నిన్న సాకారమైంది
హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో
భారత మహిళా జట్టు
దక్షిణాఫ్రికా సింహాల్ని ఓడించి...
మొట్టమొదటిసారిగా "విశ్వవిజేత"గా 
నిలిచిన భారత్ కు దక్కేను...
ప్రైజ్ మనీగా...37. 30 కోట్లు...
రన్నరప్ జుట్టుకు దక్కేను 20 కోట్లు...

ఈ అఖండ విజయం అందినవేళ
అరుపులతో...ఆలింగనాలతో...
ఆనందభాష్పాలతో...చిందులతో... చిరునవ్వులతో...స్టేడియం మొత్తం
విజయ గర్జనలతో మార్మోగిపోయింది...!

ఈ ఫైనల్ మ్యాచ్ ని టీవీల్లో
వీక్షించిన క్రీడాభిమానుల
గుండెల్లో తృప్తి కొండంత…
ఆనందం ఆకాశమంత…
సంతోషం సాగరమంత...

ఇది చెమట చుక్కలతో మన మహిళా
జట్టు సాధించిన మరో పరుగుల‌చరిత్ర...
లిఖించిన ఒక బంగారు అధ్యాయం...
సృష్టించిన ఒక పరుగుల ప్రభంజనం...

సఫారీ కెప్టెన్ లారా
చెలరేగి సెంచరీ కొట్టి
గట్టి పోటిచ్చినా
మన జట్టు ఉరిమిన
పులిలా వేట ముగించింది…
దక్షిణాఫ్రికా జట్టును మట్టి కరిపించి...
"ప్రపంచ చాంపియన్" గా నిలిచింది...

ఈ విజయానికి
ప్రేరణ...సచిన్ రోహిత్ శర్మలు...
ఆదర్శం...మిథాలి రాజ్...
విజయ త్రిమూర్తులు...
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్...
ఆల్‌ రౌండర్ దీప్తి శర్మ...
చిచ్చర పిడుగు షెఫాలి వర్మ...

బ్యాట్‌ ను కత్తిలా...బంతిని బాణంలా...
ఆత్మ విశ్వాసమే ఆయుధంగా ఆడి...
చిరుతపులులై వీరోచితంగా పోరాడి...
విజయ గర్వంతో కప్పు నందుకున్నారు
క్రికెట్‌కు ఒక స్వర్ణయుగాన్ని సృష్టించారు...

ఏడుసార్లు కప్పు ఎగరేసుకుపోయి
సెమీఫైనల్లో 338 పరుగులు చేసిన
ఆస్ట్రేలియా జట్టు ఆశలపై నీళ్లు జల్లి
127 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన
జమీమా రోడ్రిగ్స్ కార్చిన చెమటచుక్కలే
భారత్ భారీ విజయానికి పునాదిరాళ్ళు...

నిజానికి జమీమా రోడ్రిగ్స్ లేకపోతే…
ఆశతో ఆకలితో ఉన్న ఆస్ట్రేలియాను
ఆమె కట్టడి చేయకపోయి ఉండి ఉంటే..? 
భారత్‌కు ఈ ఫైనల్ ఒక తీరని కలే కదా...
ఈ అఖండవిజయం ఒక అందని ద్రాక్షేకదా..

ఆమె కృషి,కసి,తపన....ప్రపంచ మహిళా
క్రికెట్ చరిత్రలో నిత్యం...చిరస్మరణీయమే.

జయహో..! జయహో..!
ఓ మహిళా మణిదీపాల్లారా...
ఓ మహిళా క్రికెట్ క్రీడాకారులారా...
జయహో..! జయహో..!





కామెంట్‌లు