చిన్ని చేతిలో గొప్ప ప్రపంచం:- జానకీ దేవి, నాగార్జున సాగర్ -ఫోన్: 9603306788
ఉత్తమ విజేత 
==========
బడి గంట మోగగానే,
ఆటలన్నీ ఆపేస్తూ 
హడావుడిగా పరుగెడతా,
పుస్తకాల సంచీని పట్టుకొని.

అక్షరాలే ఆయుధాలై,
మాటలన్నీ మంత్రాలై,
జ్ఞానమనే ధైర్యాన్నిచ్చే,
నా బడి అంటే గుడే కదా...

బొమ్మలు గీసే పెన్సిలే,
ఇంద్రధనుస్సును చూపిస్తుంది
ఒక్క అంకె నేర్చుకుంటే,
లెక్కల లోకం దర్శనమిస్తుంది...

నా చిన్ని చేతిలో పెన్ను పట్టి,
నేనే ఒక కవిని అంటాను,
పలకపై ఒక పదం రాస్తే,
అద్భుతమైన కథ చెబుతాను...

ప్రశ్నించే గుణం నాది,
తప్పు చేయని మనసు నాది,
చదువే నా తొలి స్నేహం,
సాధించడమే నా లక్ష్యం...

ప్రతి అడుగులోనూ కొత్త పాఠం,
ప్రతి చూపులోనూ కొత్త లోకం,
నేటి బాలలే తొలి ఉషస్సులు 
దేశ భవితవ్యపు వెలుగు బాటలు!!

కామెంట్‌లు