ఎక్కడికీ?!:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
చెట్టూ పుట్టను విడిచి
చివరికి రాయీరప్ప కాని జీవిని వీడి
ఎక్కడికీ పరుగు?

వృత్తంలో బందీగా పరిధులను 
పాకుతూ గంతులేస్తూ 
వాడిన వసంతంలా ఎక్కడికి?

తెలివైన జీవి ధగధగల
విశ్వవిజేత  
మెరుపుకిరీటం నిమురుగప్పిన నిప్పు
కష్టం సుఖం అన్నీ కాలంలోనే 
గతం గాయం కాఫీషాప్ ఫిలాసఫీ ఎక్కడికి?

అన్నీ మూతపడిన చోట
వార్తలో మనిషి,పత్రికల్లో పద్యం
నిత్యం సినిమా! 
అన్నీ తనైన పరుగు ఎక్కడికీ?

ప్రశ్న తన సొంత సొత్తు కాదనే
 నిజం తెలిసినా లేని నటనలు
ఏ ఎండకు ఆ గొడుగు ఆటలు
తెరవెనుక ఆడి, ఆడించే 
మార్మిక మాయ కొత్త ప్రతీకల డిక్షన్ ఎక్కడికీ?

తను వేసిందే గొప్ప అనేది అందంగా ఉండొచ్చు కానీ
జ్ఞానం ఆలోచనలో అర్థం వాస్తవీయత పట్టని 
ఆ గొప్పల పరుగు ఎక్కడికీ?!

అన్నీ ఒక మూటగట్టిన 
ముత్యాలో రత్నాలోననే భ్రమ 
గోడపై మరో కొత్త శ్వాస చిగురు 
ఆశలు ఊహలు పల్లవించి పరిమళిచే!

తొందరలో పడేసే కాలం నిమ్మళం 
తిరిగిరాని నది ప్రవాహం ఆగమ్యం 
మాటలేని నడక దానిది
నడకలోనే అన్ని కళలు కలలు
శబ్దనిశ్శబ్దాలై 

రేపటి తూర్పున వెలుగు 
నేడు వాలే చీకటి నిద్రలో పడమర
అక్కడ మెలకువ ఇక్కడ నిద్ర
ఇక్కడ మెలకువ అక్కడ నిద్ర 
 విన్యాసంలో ఆదాబ్ గ్లోబ్!

కాలం విడిచిపోతుందేమో కానీ
వదలదు పట్టిన నీ చిటికెనవేలు
 పట్టు  క్రమశిక్షణ వీడని గమనంలో 
అనంతయానక దృశ్యం అది

ఎవరికెన్ని వసంతాల అనుభం
ఎవరికెలా అందిస్తుందో తెలియనిది కాలం 
అంతుచిక్కని ప్రయాణంలోకి జారే కలగా... 


---------------

కామెంట్‌లు