కవి కలమే త్రిశూలమైతే..?:- కవి రత్న-సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి, -అత్తాపూర్, హైదరాబాద్
కవి కలమే... 
ఒక హలమైతే..?  
అక్షరాల విత్తనాలు చల్లి 
జ్ఞాన తృష్ణను తీర్చే 
ఖండకావ్యాలు పండించే
కర్షకుడౌతాడు కవి..!

కవి కలమే...
ఒక త్రిశూలమైతే..?  
అంతర్ముఖ తపస్సుతో  
జ్ఞానఖడ్గంతో  
అజ్ఞానాన్ని చీల్చే 
త్రినేత్రుడౌతాడు కవి..!

కవి కలమే... 
ఒక గాలమైతే...?  
అభ్యుదయ 
సమాజ సాగరంలో 
విచ్చలవిడిగా తిరిగే
వీర విహారం చేసే
అవినీతి తిమింగలాలను  
వేటాడే మత్స్యకారుడౌతాడు కవి..!

కవి కలమే... 
ఒక వజ్రాయుధమైతే..?  
అహంకారపు 
సంకెళ్ళు తెంచుతూ
అజ్ఞానాంధకారాన్ని ఛేదిస్తూ  
అణచివేతలకు గురైన 
అంటరానితనానికి బలైన
అమాయకపు జనానికి 
జాగృతి గీతమౌతాడు
రక్షణ కవచమౌతాడు కవి..!

కవి కలమే... 
ఒక అణుబాంబైతే..? 
నరహంతకులను నిర్మూలిస్తూ  
కుళ్ళిన వ్యవస్థను శుద్ధి చేస్తాడు  
నవసమాజ నిర్మాణానికి 
పునాది వేస్తాడు కవి..!



కామెంట్‌లు