సామెత -66; అయితే ఐతారం -కాకుంటె సోమారం అన్నట్టు
****
" గీళ్ళకి ఎప్పుడు తెలివొత్తదో ఏమో? గాళ్ళని గీళ్ళని సూశైనా నేర్సుకోరు.రెక్కలు ముక్కలు సేస్కుని కట్టపడతరు. గా వొచ్చిందాన్ని కల్లు,సారకి తగల బెట్టేటోళ్ళు, డాబుసరికి బోయి ఉన్నదంత తగలబెట్టేటోల్లు మరీ ఎక్వయి పోయిండ్రు. గంద్కనే బుద్ధి గ్యానం ఉన్నోడు,రేపటి సూపున్నోడు ఎద్గుతుండు. రేపట్కి రూపం లేదన్కుంట మెట్ట ఏదాంతం పల్కెటోడు ఎక్కడేసిన గొంగలి అక్కడె ఉన్న తీర్గ ఉన్నడు.
"గింత ఇగురం లేదాయె. రేపెట్ల బత్కుతమన్న సోవి లేకపోయె.ఎవలు శెప్పాలె గీళ్ళకి. సాచ్ఛాత్తు బమ్మ దేవుడొచ్చి జెప్పినా గిదే తీర్గ పోవుడు.వొయసు పోరగాండ్లు సుత గీ పోబడే బోతుండ్రు.సోకులు,జెల్సాలెక్కువైనయ్.ఏందిరా వారీ! అని గట్టిగడిగితే తలెగరేసుడు."
"ఇంటికొచ్చిన కానుంచి సూత్తున్న.ఏందయ్యా! గంతగనం బుగులు బడబడ్తివి? ఒక్క తీర్గ యిశారం చేయబడ్తివి? గదేందో నా శెవుల సుత ఎయ్య రాదు." అన్న అవ్వ మాటల్కి..
ఏముందే! మన శేన్లల్ల పన్లకొచ్చే గా ఎంకన్న,గోపయ్య,జమాలయ్యల ముచ్చటే. గాళ్ళు యాడికెళ్ళినా ఇద్దరి పని ఒక్కలన్నంత యిదిగ జేత్తరు. కూలి పైకం గట్ల బాగనే ముడ్తుంది గని ఏం లాభం. వొచ్చిందంత లట్ట లట్ట తాగుడు.లప్ప లప్ప తినుడు. ఇంగ గాళ్ళ నోట్లెనుంచి ఊశిపడ్డరు వాళ్ళ పోరలు సుత. పన్లు లేన్నాడు ఇంగ శేతులెల్లికలేసుడే.తిండికి తిప్పలు పడుడే.
అంటె గాళ్ల ముచ్చటి"అయితే ఐతారం-కాకుంటే సోమారం అన్నట్టు" గంతే గదయ్యా!"
అవునే! గట్లనే వుంది గాళ్ళ యవ్వారం. శేజేతుల బత్కుల్ని పాడు జేస్కుంటుంటె,ఇంగ గాళ్ళకి మంచిదినాలు రమ్మంటె ఎట్లొత్తయ్ శెప్పు?"
వొయ్యిలు ముందేస్కుని సద్వుకుంటనే ఓ పక్క తాత,అవ్వల ముచ్చటి సుత యింటున్న భూలచ్మికి అవ్వ అన్న మాటలు సమజవ్వలే.
"అవ్వా!"అయితే ఐతారం - కాకుంటే సోమారం అంటేందే? అడ్గింది."
"ఏమే భూలచ్మీ!గింతకి నువ్వు పాఠాలు సద్వుతున్నవా? మా మాటల్ని శెవినేస్కుంటున్నవా? సర్లె తీ!
"ఐతారం వొచ్చిందంటే మనమేం జేస్కుంటమో తెల్సు గదే?
"నేనే జెప్తవ్వా!శికెనన్న మటనన్న తెచ్చుకుంటం.ఒక్కో త్యేప గుడ్ల పుల్సు సుత చేస్కోని తింటం.గీ ఐతారం తాతను శెర్ల శేపలు పట్కరమ్మనే" అని గార్వాలు బోతున్న మన్వని మాటల్కి... గా మాటేదో బల్లెపీట మీద కూసున్న తాతకే జెప్పరాదురా!
యిన్నవానే భూలచ్మీ! "అయితే ఐతారం అంటే శేతుల పైసలు టికటికలాడ్తున్నప్పుడు గిట్ల ఏదంటది తెచ్చుక తింటం. గవి లేన్నాడిక సోమారమే అంటే శివయ్యని మొక్కెటోళ్ళు సోమారాలు ఉపోషాలుంటరు. గా దినం పొద్దిటీల్నించి పోద్దూకే దన్క ఏం తినరు గద!గట్లన్న తింటానికి లేకుండ అవడం అన్నమాట.
"గంద్కేనే! గిట్ల ఐతారం సోమారం మీద బెట్టి పైన జెప్పినస్మంటోళ్ళకి సురక అంటిచ్చినట్టు గిట్ల గీ సామెత బుట్టించిండ్రు మన ఎన్కటోళ్ళు. ఉన్నప్పుడు జాగర్తగ కర్సు బెట్టుకుంట పదో పరకో ఎన్కేస్కుంటే ఎవ్వలికి గిస్మంటి పరిత్తితి రాదు." అవ్వ మాటల్కి...
"అవ్వా!అయితే గీ ఐతారం శేపలు లెవ్వా? అంటున్న బుడ్డోడి మాటల్కి అవ్వ తాత,భూలచ్మితో పాటు అప్పుడే అక్కడికొచ్చిన బుడ్డోడి నాన్న, అమ్మ సుత మస్తు నవ్వబట్టిండ్రు.
గిదండీ సంగతి! "ఉన్నప్పుడు వొళ్ళు సోయి తెల్వకుండ జెల్స జెయ్యడం- లేన్నాడు ఉపోషం ఉండటం"- గది మాన్కోమని శెప్పనీకె గీ సామెత.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి