కృష్ణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన తెలివైన యువకుడు. పట్టణంలో ఉంటూ, బాగా చదివి గొప్ప యంత్ర నిర్మాణ నిపుణుడు కావాలనే కల కన్నవాడు. అతడి ఆన్‌లైన్ తరగతుల కోసం, తండ్రి పట్నంలో కూలి పని చేసి, ఆ కష్టపడిన డబ్బుకు వడ్డీకి అప్పు చేసి మరీ అతనికి ఖరీదైన చరవాణి కొనిచ్చాడు. ఆ తండ్రి ఆశలన్నీ, ఆ చరవాణి కేవలం పరికరం కాదు, కృష్ణ బంగారు భవిష్యత్తు కోసం వేసిన మొదటి అడుగుగా నిలుస్తుందని.
మొదట్లో కృష్ణ శ్రద్ధగా గురువులు చెప్పిన పాఠాలు వినేవాడు. కానీ నెమ్మదిగా, యాంత్రిక ఆటల లోకం, చిన్న చిన్న దృశ్య చిత్రాల వెలుగు అతన్ని బలంగా ఆకర్షించాయి. ఆ పరికరం అందించే తక్షణ ఆనందానికి అలవాటు పడ్డాడు. రాత్రి వేళల్లో, తరగతుల పేరు చెప్పి, తలుపు వేసుకుని తెల్లవార్లూ చరవాణికే అతుక్కుపోయేవాడు. దీని కారణంగా కృష్ణ సరైన నిద్ర లేక శరీరం బడలిపోయింది. కళ్ల కింద నల్లటి వలయాలు, పగటి తరగతిలో మగత. చుట్టూ ఉన్న నిజ ప్రపంచం అతనికి నిస్సారంగా కనిపించేది. పుస్తకాలు ముట్టుకుంటే నిద్ర వచ్చేది, కానీ చరవాణిలో దృశ్య చిత్రాలు చూస్తే మాత్రం ఉదయం వచ్చేది. స్నేహితులతో సరదాగా మాట్లాడటం, మైదానంలో పరుగు తీయడం పూర్తిగా మానేశాడు. తన ప్రపంచం ఆ నాలుగు అంగుళాల తెరకే పరిమితమైంది. తండ్రి అప్పుడప్పుడు దృశ్య సంభాషణ చేసి, "కళ్లెందుకు అలా అలసిపోయాయి?" అని ఆందోళనగా అడిగితే, "పాఠాల ఒత్తిడి నాన్న" అని అబద్ధం చెప్పేవాడు. అతడి శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించడం మొదలైంది.
కొద్ది కాలంలోనే, యంత్ర నిర్మాణ ప్రవేశ పరీక్ష వచ్చింది. పరీక్షకు సిద్ధమవ్వడంలో కృష్ణ విఫలమయ్యాడు. ఫలితాలు వచ్చిన రోజు, కృష్ణ ఆశించిన ర్యాంకు సాధించకపోగా, కనీసం ఉత్తీర్ణత మార్కులు కూడా రాలేదు. తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఫలితాలు చూసిన తండ్రి తల పట్టుకొని కూర్చున్నాడు. కృష్ణ దగ్గరకు వచ్చి, కోపగించుకోకుండా, నిరాశగా పక్కనే ఉన్న చరవాణిని తీసుకుని, అతడి చేతికి ఇచ్చాడు.
తండ్రి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మెల్లగా, కానీ బలంగా అన్నాడు: "నాయనా, ఈ పరికరం ఒక అద్భుతమైన వరం. కానీ నువ్వు దీన్ని బానిసలా మార్చేశావు. నువ్వు దీన్ని వాడుకోవడం లేదు, అది నిన్ను పూర్తిగా వాడుకుంటోంది. నీ చదువును, నీ విలువైన ఆరోగ్యాన్ని దొంగిలించింది. నువ్వు ఒక యాంత్రిక కారాగారంలో కూర్చున్నావు. ఆ కారాగారపు తలుపులు నువ్వే తెరవాలి."
ఆ మాటలు కృష్ణ హృదయాన్ని తాకాయి. అతను తన పొరపాటును గ్రహించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు కృష్ణ చరవాణి వాడకాన్ని నియంత్రించుకోవడం మొదలుపెట్టాడు.
జ్ఞాన సాధనం మన జీవితాన్ని మెరుగుపరచాలి కానీ, మన జీవితాన్ని మొత్తంగా ఆక్రమించకూడదు. ఇది నీ ప్రపంచంలో ఒక భాగం మాత్రమే, నీ మొత్తం ప్రపంచం కాదు.
వ్యసనం:-సి.హెచ్.ప్రతాప్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి