భరతమాత ముద్దు బిడ్డలారా..!:- కవి రత్న -సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్ -పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్

(యువతకు స్వామి వివేకానందుని సందేశం)

ఓ నా భరతమాత ముద్దు బిడ్డలారా…!
మీరు పాపులని ఎవరు చెప్పారు?
మీరు పవిత్ర జ్యోతులే 
దైవశక్తి మీ నరనరాల్లో ప్రవహిస్తుంది.
మీరు వృద్ధులు కాదు… 
బలహీనులు అసలే కాదు,
అనంత శక్తికి మీరు సజీవ ప్రతిరూపాలు.
“మా వల్ల కాదు… 
"మేం చేయలేము” అనడం
ఆత్మకు వేసే సంకెళ్లే తెలుసా..?
పిరికితనపు నీడలో 
బానిసలై బ్రతకకండి...వీరులై లేచి
విజయ శంఖారావం పూరించండి…!

ఓ నా భరతమాత ముద్దు బిడ్డలారా..!
“మేము సాధించగలం” అనే
అఖండ విశ్వాసమే మీ ఆయుధం.
ఈ నాడు దేశానికి కావలసింది
ఇనుప కండరాలు – ఉక్కు నరాలు
బలమైన మనసు – అచంచల సంకల్పం.
చాలా కాలం ఏడ్చారు…చాలిక
కన్నీళ్లకు కాదిక కార్యానికి సిద్దంకండి
చిరుత పులులై ముందుకు దూకండి…!

ఓ నా భరతమాత ముద్దు బిడ్డలారా..!
లేవండి… 
మీరు సింహాలని గుర్తుంచుకోండి.
మీరు గమ్యం చేరు వరకు
మీ పరుగు ఆపకండి
భయమన్నది
మీ నిఘంటువులో ఉండరాదు.
ధైర్యమే మీ శ్వాస...
సంకల్పమే మీ శక్తి...
బలమే అభివృద్ధికి సోపానం
బలహీనత మరణంతో సమానం..!

ఓ నా భరతమాత ముద్దు బిడ్డలారా..!
బద్దకం మనకు బద్దశత్రువు 
అది ఒక వ్యాధి.
ఆ వ్యాధితో బయట తిరిగే హక్కు
మీకు ఎవరు ఇచ్చారు..?
వెలిగే సూర్యుణ్ని చూసి 
చీకటి వెనకడుగు వేస్తుంది
శ్రమించే మనిషిని చూసి
ఓటమి వణికిపోతుంది.
విశ్రమించక శ్రమించండి...
విశ్వవిజేతలుగా ఎదగండి…
భారతావనిలో మణిదీపాలై 
వెలుగులు విరజిమ్మండి…!

( స్వామి వివేకానంద జయంతి సందర్భంగా )


కామెంట్‌లు
Popular posts