భోగి ఉదయం...
చల్లని మంచులో
భోగిమంటల జ్వాలలు ఎగిరి
నా గుండెను తాకుతుంటే
పాత బాధలు, గతం తాలుక కన్నీళ్లు బూడిదై ఆకాశంలో కలిసిపోతున్నాయి...
కానీ ఆ మంటల్లో నా చిన్ననాటి నవ్వులు,
కట్టెలపొయ్యి మీద నీళ్లు,
తాతయ్య గొంతు,
అమ్మమ్మ కథలు,
మళ్లీ బతికి, కళ్లలో నీళ్లుగా మెరిసి నన్ను కౌగిలించుకుంటున్నాయి.
భోగి పళ్ళు తలపై నుండి జారి,
నా నోట్లో కరిగినప్పుడు...
ఆ తీపిలో తల్లి ప్రేమ,
ఆ రుచిలో బాల్యం మొత్తం కరిగిపోతుంది
ఎన్నేళ్లయినా... ఆ మధురం గుండెను తడముతుంది,
నాలో ఏడుపును రేపుతుంది.
ఎందుకంటే అవి కేవలం పళ్ళు కాదు... అది నా ప్రియమైన గతం.
సంక్రాంతి ఉదయం...
సూర్యుడు ముంగిట నిలిచి అమ్మతో కలిసి నవ్వుతుంటే,
నాన్న నువ్వులనూనెతో వచ్చి
నన్ను,నూనిని అమ్మకి అప్పగిస్తే,
నలుగు పెట్టి నునుపుదేలిన నామోమును చూసి మెటికలు విరించింది మామ్మ.
అమ్మ,మేనత్త,నానమ్మ, అమ్మమ్మలు తలో చేయి వేస్తే
సకినాల సుగంధం, చక్కిరాల తీపి
నా ముక్కుపుటాలను తాకింది.
నా అడుగులు వంటగదిలో అత్తిరసాల(అరిసెల) వైపు సాగాయి,
బామ్మ జేజకి మొక్కేదాకా ఆగు బిడ్డ అంటే, వాటి బంగారు రంగు తల్చుకుంట
బాబాయ్ తో కలిసి పంతంగి ఎగిరేసేదానికి పరుగువెట్టిన,
అప్పటికే అటుకేసి వచ్చిన గంగిరెద్దులోడు అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటుంటే, తలకాయ ఊపుకుంట, కాలెత్తింది, తంతదని నేనెనక్కి జరుగుతుంటే ఏమనది బిడ్డ అని నాతోనె వంద కాయితం, పాత అంగీలు ఇప్పించిండు మా నాయిన.
అప్పటికి అందరూ మొక్కుదురురారీ! అని అక్క కేకేసింది,
మొక్కి..
ఆ ఇంత అన్ని బుక్కే వరకు
సాయంత్రం కోడి పందేలయాల్లయ్యింది.....
సాయిలు తాత దొడ్లో నుండి సర్రున ఆడికివోతే
డేవిడ్ అంకుల్ డేగ గెలిచింది అన్నరు.
గెలిచిన పైసలు ఆయంకులు, సాకలి సోమన్నకి ఇచ్చిండంట పిల్ల లగ్గమున్నదని
గెలిచినా ఓడినా...
స్నేహం చేతులు గట్టిగా పట్టుకుంది.
కనుమ రోజు...
కైకిలి ఉండదని కనకయ్య మామ కాడెద్దులకు సల్లనీళ్ళు బోసి,
బుక్కా సల్లిండు.
పాడి పశువుల కళ్లలో ప్రేమ చూసి
కళ్ళనీళ్ళుదీసిండు.
దేవతకు మొక్కినట్టు వాటి కాళ్ళకి మొక్కిండు.
మామ ఎందుకు అట్లా జేస్తుండు అని తాతని అడిగితే
ఈ మూడు రోజులు...
కేవలం పండుగలు కావు నాయనా
మడుసుల గుండెలను తట్టిలేపే గురుతులు.
బంధాలు దగ్గరికొచ్చి హత్తుకునే రోజులు అన్నడు.
గదిప్పుడు నాకు అనుభవంలోకొచ్చాక నిజమయ్యింది.
నిజ్జంగా.... నిజం
సంక్రాంతి... నా జీవితంలో ఎప్పటికీ మరవలేని భావోద్వేగ ఉత్సవం!
🌾🔥❤️🐄🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి