“వినరో భాగ్యము విష్ణు కథలు”:(39): - ఎం బిందుమాధవి

 “కామహా కామకృత్కాంత:కామ:కామ:ప్రదప్రభు:
యుగాది కృద్యుగా వర్తో నైక మాయో మహాశన:
అదృశ్యో ఽవ్యక్త రూపశ్చ సహస్రజిదనంతజిత్”

“బామ్మా..రవి అలిగాడు. ‘ఈ రోజు శ్లోకాలు నేర్చుకోవటానికి నేను రాను’ అని భీష్మించుకు కూర్చున్నాడు. ‘నాకు ఆ స్కూల్ బ్యాగ్ కొనిస్తేనే బామ్మ దగ్గరకి వెళతాను’ అని వాళ్ల అమ్మ మీద అలిగి కూర్చున్నాడు” అని వాసు వచ్చి చెప్పాడు.
“వాడికి ఖరీదైన స్కూల్ బ్యాగ్ కావాలి. నెలాఖరులో కొనలేక వాళ్ల అమ్మ వాడిని బుజ్జగించటానికి ప్రయత్నిస్తుంటే, వాడు ఇంకా ఇంకా బిగిసిపోతున్నాడు. అవునా? అదే ‘కామం’ అంటే. ఒక వస్తువు, విషయంలో కావాలనే బలీయమైన కోరిక. అలాంటి అసందర్భపు కామాలని, కోరికలని ఆ పరమాత్మ తగ్గించగలడు. అంతేకాదు నువ్వే కావాలని బలంగా కోరుకుని ధ్యానం, తపస్సు చేసేవాళ్ళ కోరికలని తీర్చేవాడూ ఆ పరమాత్మే అన్నమాట.”
“ఒక్క మాటలో చెప్పాలంటే అసందర్భమైన కోరికలని తొలగించేవాడు ఆయనే! న్యాయమైన, ధర్మబద్ధమైన కోరికలు తీర్చేవాడూ ఆయనే! ఆ దేవ దేవుడు తన కరుణ ద్వారా, జగన్నిర్వహణ కోసం తను చేసే పనుల ద్వారా మనకి అందంగా కనిపిస్తాడు. మన రోగాలు తగ్గటానికి ఔషధం లాంటి వాడు.”
“ఎలాగంటే..మొన్న బాలు చెప్పినట్లు మన అమ్మ మనం కోరినవన్నీ తీర్చటం వల్ల, ఆవిడ మన మీద కురిపించే ప్రేమ వల్ల, మనకి జ్వరం వచ్చినప్పుడు..తను నిద్ర పోకుండా మన మంచం పక్కనే కూర్చుని చేసే సేవల వల్ల అమ్మ మనకి చాలా అందంగా కనిపిస్తుంది. వెనకటికి ఎవడో ‘మా అమ్మ కనిపించట్లేదు’ అని పెద్దగా ఏడుస్తున్నాడుట. వాడి ఏడుపు మాన్పించాలి అని ‘మీ అమ్మ ఎలా ఉంటుంది’ అని అడిగారుట. ‘ఇలా ఉంటుంది, అలా ఉంటుంది’ అని బోలెడు వివరాలు చెప్పి, చివరికి ‘మా అమ్మ చాలా అందంగా ఉంటుంది’ అని చెప్పాడట. వాళ్లు చాలా అందమైన ఆడవాళ్ళని బోలెడు మందిని చూపించారుట. ‘ఈవిడ మా అమ్మ కాదు. మా అమ్మ ఇంత కంటే అందమైనది’ అని చెప్పాడట. చివరికి ఒకావిడని చూపించి ‘ఈవిడేనా మీ అమ్మ’ అని అడిగితే..’ఆ:( ఈవిడే’ అని వెళ్లి హత్తుకుపోయాడుట. తీరా చూస్తే ఆవిడ అంద వికారంగా ఉందిట. అంటే..మనని ప్రేమించేవారు, మన పట్ల దయతో, కరుణతో ఉండేవారి రూపు రేఖల గురించి మనం పట్టించుకోము. వారి మనసుని బట్టి మనకి చాలా అందంగా కనిపిస్తారు. మీకు తేలికగా అర్థం అవ్వాలని ఈ ఉదాహరణ చెప్పానే కానీ..ఆ పరమాత్ముడు దయలో మాత్రమే అందమైన వాడు, రూపంలో అంద వికారుడు అని అర్థం కాదు. కాబట్టి ఆ శ్రీమహావిష్ణువుని “కామహా కామ కృత్కాంత:” అనే విశేషణంతో చెబుతాము.”
“అంతేకాదు..అతి సుందరమైన మన్మధుడికి ఆయన తండ్రి కాబట్టి ఆయనని ‘కామకృత్’ అని పిలుస్తారు. తమకున్న ఎలాంటి కోరికలనైనా తీర్చేవాడు కాబట్టే ఆయన గురించి ధ్యానిస్తారు. ఆ దేవ దేవుడు భక్తులు తనకి చేసిన పూజలకి, తనపై చూపే భక్తికి అర్హమైన అన్ని ఫలితాలని నిస్సందేహంగా అందించే ఏకైక ప్రభువు. ప్రభువు అంటే రాజు. ఒక రాజ్యంలో రాజు చెయ్యలేని పని అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఆ శ్రీమహావిష్ణువుని “కామ:కామప్రద ప్రభు:” అంటాము.
“ఆ దేవ దేవుడుని ‘యుగాది కృద్యుగా వర్తో’ అంటాము. యుగాలు అంటే మీకు ఇంతకు ముందు చెప్పాను కదా..కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలన్నమాట. అవి ప్రారంభమవటానికి..ఒక దాని వెనక ఒకటి నిరాటంకంగా సాగటానికి, కాలానుగుణంగా అవి నశించి, మళ్లీ మళ్లీ యుగాల చక్రం నడవటానికి కారకుడు” అని బామ్మ చెప్పగానే “జల ప్రళయం వచ్చి జీవులన్నీ నశించిపోగానే మళ్లీ సృష్టి జరగటానికి కావలసిన బీజాలన్నీ ఆయన దగ్గరే ఉంటాయని ఇంతకు చెప్పావు కదా బామ్మా! కాబట్టి యుగ ప్రారంభకుడు ఆయనే కదా! మళ్లీ సృష్టి అనగానే ఒక యుగం ప్రారంభమైనట్లు కదా” అన్నాడు విష్ణు.
“అవును. ఆయన అనేక మాయలు చేస్తూ ఉంటాడు. అవి ఒకటి కాదు, రెండు కాదు. అనేకం” అని బామ్మ ఆపగానే..”మాయలు అంటే మ్యాజిక్కా బామ్మా” అన్నది పావని. “మీకు అర్థమయ్యే మాట అయితే మ్యాజిక్కే! చదువు రాని వాడికి మంచి ఉద్యోగము, హోదా కలిగి జీవితం గొప్పగా నడిచేట్లు చేస్తాడు. అందమైన స్త్రీకి అనాకారి భర్త, ధర్మపరుడికి అనేక కష్టాలు, అవినీతి పరుడికి బోలెడన్ని భోగాలు, సుఖాలు, అధిక విద్యావంతుడికి అర్హత కల ఉద్యోగం కానీ, ఉపాధి కానీ లేక హీనంగా బతికే పరిస్థితులు రావటం..ఇవన్నీ మాయలే కదా! అలా ఆయన “నైకమాయో” అన్నమాట.
“మహాశన:” అంటే..యుగాంతంలో సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ నశించిపోతాయి..అవునా? అలా ఆయన అన్ని జీవులనీ ఆహారంగా తనలో కలిపేసుకునే మహా శక్తి. అలా కంటికి కనిపించకుండా అదృశ్యంగా, అవ్యక్తంగా ఉంటూనే..తన కర్తవ్యాలన్నీ నిర్వహించే మహా విరాట్స్వరూపం ఆ శ్రీమహావిష్ణువు. ఉదాహరణకి..ఇవ్వాళ విత్తనం నాటి నువ్వు ఇంటికెళ్ళి పడుకుంటావు. రేపు పొద్దున లేచి చూసేసరికి విత్తనాల్లో నించి మొలక వస్తుంది. ఇవ్వాళ పువ్వుగా ఉన్న దానిలో నించి రేపు పిందె వచ్చి, ఎల్లుండి అది కాయ అవుతుంది. నిన్న తిరుగుతూ ఉన్న ఆవుకి ఇవ్వాళ దూడ పుడుతుంది. పుట్టగానే అది చెంగు చెంగున అటూయిటు ఎగురుతూ ఉంటుంది. ఇవన్నీ మనం చెయ్యట్లేదు. అలాగే ఒక రోగికి నిన్నటి వరకు వైద్యం చేసిన డాక్టరు..’లాభం లేదండీ. మేము చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేశాము. ఈ రోగి బతికే ఆశ లేదు’ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. హఠాత్తుగా ఏమీ జరుగుతుందో మనకి తెలియదు. తెల్లవారి ఆ రోగికి రోగం నయమై, లేచి కూర్చుంటాడు. అలా అదృశ్యంగా, తానే చేస్తున్నట్టు తెలియకుండా అన్నీ ఆ శ్రీమన్నారాయణుడే చేస్తూ ఉంటాడు. అదే “అదృశ్యో ఽవ్యక్త రూపశ్చ సహస్రజిదనంతజిత్” అని ముగించింది బామ్మ.
“నిజమే కదా..మొన్న మా బాబాయ్ వాళ్ల మామగారి గురించి డాక్టర్ ఇలాగే చెప్పి వెళ్ళిపోయాక, మరునాడు ఆయనకి పూర్తిగా నయమై, ఇంటికి తీసుకొచ్చారు. ఆ రోజు..ఇలా ఎలా జరుగుతుంది అని అందరికీ ఆశ్చర్యమే! ఓహో ఇదా సంగతి. అదంతా ఆ శ్రీమన్నారాయణుడి పని అన్నమాట” అన్నది వీణ.
“మనని ఎప్పుడు కనిపెట్టుకుని ఉండి, ఎలా ఆయన కాపాడుతూ ఉంటాడో ఇప్పుడు తెలిసిందా? సరే రేపు మిగిలిన శ్లోకాలు చెప్పుకుందాం” అని పిల్లలని పంపించేసింది బామ్మ.
కామెంట్‌లు