శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 66
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
45.పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా (షోడశాక్షరీ)
46.శింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజా (షోడశాక్షరీ)
నలభై ఆరవ నామ మంత్రము - 
  ఓం శింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజాయై నమః
శింజాన = లయబద్ధంగా, మధురముగా శబ్దము చేసే; మణి = రత్నాలు, మణులు, మాణిక్యాలు పొదగబడిన; మంజీర = అందెలు/కాలి గజ్జెలు; మండిత = అలంకరింపబడిన; శ్రీ = శుభములను ఇచ్చు; పాదాంబుజా = పాదములు కలిగిన దానా
రత్నాలు, మణులు, మాణిక్యాలు పొదగబడి, అందంగా, లయబద్ధంగా, మధురముగా శబ్దము చేసే, గజ్జెలతో అలంకరింపబడిన, శుభములను ఇచ్చు పాదములు కలిగిన  పరమేశ్వరికి నమస్కారము
జగన్మాత, జగజ్జననీ అయిన లలితా పరాభట్టారిక, అన్ని లోకాలకూ జీవ ప్రకాశాన్ని ఇస్తున్న తన పాదాలకు, రత్న మణి మాణిక్యాలు అద్దబడి, బంగారంలో చేయబడిన మంజీరాలు/కాలి గజ్జెలు ధరించి, రాజహంస లాగా కదలి వస్తుంటే, పరమేశ్వరి కాలి గజ్జెలు, పరమశివుని ఢమరూ నాదం లాగా, సుస్వరంగా, లయతో మధురమైన శబ్దం చేస్తూ, అమ్మ రాకను లోకానికి తెలియజేస్తున్నాయి. ఇలా రాజహంస ఠీవి తో కదలి వస్తున్న పరమేశ్వరి పాదాలను, చూసిన వశిన్యాది వాగ్దేవతలు "శింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజా" అని కీర్తించారు. పరాత్పరి, చిరు చిందులు వేసి, దరహాస కాంతులను పంచింది.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, చంద్రుడు, యమాధిపతి మొదలైన ముక్కోటి దేవతలు తలలు వంచి నమస్కరించి, పూజించి, తరించిన పరమేశ్వరి పాదాలు "శ్రీపాదాలే". అచంచల భక్తిని మనలో తట్టి లేపే అటువంటి అమ్మ పాదాలను "మండితశ్రీ" అని కొలుచుకోవడం సముచితము. సౌభాగ్యకరము, ముక్తి దాయకము కూడా.
అమ్మవారి ముఖ కాంతుల నుండి ఉద్భవించిన వశిన్యాది వాగ్దేవతలు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు. వీరు, పరమేశ్వరి పాదాల నుండి వెలువడే కాంతులు, కొలనులోని పద్మముల కాంతి కంటే ఎక్కువగా ప్రకాశిస్తున్నాయి, అన్నారు. ఎందుకంటే, పరమేశ్వరి ఉద్యద్భానుసహస్రాభ (ఉదయిస్తున్న వేయిమంది సూర్యుల కాంతిని కలిగివున్నది) కదా!. అమ్మ తన పద్మపాదాలపైన ధరించిన గజ్జెల శబ్దం, ప్రణవనాదమైన "ఓం" కారాన్ని గుర్తుకు తెస్తున్నది. సుస్వరంతో, వేదవేదాంగాలు వల్లె వేసే బ్రాహ్మణుల స్వరము మన చెవులకు ఆనందాన్ని కలిగిస్తున్న అనుభూతిని ఇస్తున్నది.
అందమైన, నిత్య ప్రకాశవంతమైన, మంజిరాలు కలిగిన పాదాలతో ముజ్జగాలకూ వెలుగులను ప్రసాదిస్తూ, "ఓం" కారాన్ని గుర్తుకు తెస్తూ, మనలను అనుగ్రహిస్తున్న లలితా పరాభట్టారికను  పూజించేటప్పుడు 
ఓం శింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు