శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 68
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
47.మరాళీమందగమనా (అష్టాక్షరీ)
48.మహాలావణ్య శేవధిః (అష్టాక్షరీ)
నలభై ఎనిమిదవ నామ మంత్రము - 
  ఓం మహాలావణ్య శేవధియే నమః
శేవధిః = నిధి; లావణ్యము = సౌందర్యము/అందము
మహదానందాన్ని తన భక్తులకు కలిగించే ఎంతో గొప్పదైన అందాన్ని సొంతం చేసుకుని శ్రీచక్ర నివాసినిగా వున్న త్రిపురాంతకుని సతి, త్రిపురసుందరి కి నమస్కారము.
"ఓం మహాలావణ్య శేవధియే నమః" అని తనను సేవించి, ఉపాసించే సాధకునికి, అమ్మ లోని, మాతృత్వ తత్వమూ, ఆధ్యాత్మిక సౌందర్యమూ, కనిపించి, ఈ చరాచర జగత్తు అంతా జగన్మాత గానే కనిపిస్తూ ఉంటే, నిరంతరం శ్రీమాత నామస్మరణ లో ధన్యతను పొందుతాడు.
అమ్మ ఇచ్చిన దివ్యమైన కన్నులతో, అమ్మ సౌందర్యాన్ని చూసిన వశిన్యాది వాగ్దేవతలకు, పరమేశ్వరి అందాన్ని వర్ణించడానికి, సరిపోయిన ఉపమానం దొరకలేదు. అందుకనే వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "మహాలావణ్య శేవధిః" అని కీర్తించి, సంతృప్తి చెందారు.
పరమేశ్వరి దయతో, అమ్మ బహి రూపాన్ని చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను అనేక ఉపమానాలతో పోల్చి పిలుచుకున్నారు. కీర్తించారు. ఆ కీర్తనలను విన్న పరాత్పరి సంతోషించింది కూడా. కానీ, అమ్మ వారి గడ్డాన్ని, నడుము భాగాన్ని వర్ణించడానికి ఉపమానాలు దొరకలేదు, వశిన్యాది వాగ్దేవతలకు. అమ్మ బాహ్య రుపాన్ని విడివిడిగా గానంచేసిన వశిన్యాది వాగ్దేవతలు, పూర్ణస్వరూప లావణ్యాన్ని పొగడటానికి ఉపమానం చూపలేక, "అతిశయించిన అందానికి నిధి పరమేశ్వరి" అన్నారు.
*ఈ చరాచర జగత్తు లో ఏ వస్తువు/ప్రాణి శాశ్వతము కాదు. అన్నీ ఏదో ఒకరోజు నశించేవే. కానీ, పరమేశ్వరి తనలో ఉన్న సౌందర్య నిధి తో ఈ సర్వ ప్రపంచాన్ని సౌందర్య మయంగా చేస్తోంది. అమ్మ ఆందం శాశ్వతమైనది. సచ్చిదానంద స్వరూపమైనది. ఆ అమ్మలగన్నయమ్మ అందం "సౌందర్యానికి పరాకాష్ట". "ఆమే అందం. అందమే ఆమే." ఇటువంటి తన నిత్య సౌందర్యాన్ని చూచే అదృష్టాన్ని కలిగించి, తన భక్తుల దుఃఖాలను పోగొడుతూ... కోరికలను తీర్చుతున్న, శ్రీచక్ర మధ్యవాసిని అయిన లలితా పరాభట్టారికను  పూజించేటప్పుడు 
ఓం మహాలావణ్య శేవధియే నమః అని జపించాలి.*
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు