మాతృభాష: - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9749305871.
రక్తంలా నాలో 
ప్రవహించే నది 
అమ్మ నేర్పిన తొలి మాట
 అందంగా స్వేచ్ఛగా ఆడుకునే విశాల అక్షరమైదానం

తీరం చేరిన అల
అమ్మ నిమిరిన ప్రతి తల
మెరిసింది మాటల సందడిలో పండుగలా 

విశాల గగనంలో చందమామ
విశ్వాస విశ్వంభరలో అక్షరప్రేమ
పాలుపోసి గోరుముద్ద కలిపి
నా నాలుకకు నేర్పిన
నాలో మనసు పూసిన బోసినవ్వు 
అది మాతృభాషగాక మరోటి కాదు

దేశదేశాలు తిరిగిన పాదాలు
తిరిగి తల్లిని చేర
తీరని దాహాన్ని తీర్చ
అందించేదే మాతృభాష

అమ్మ నా ఉనికి బతుకు మాత్రమే కాదు
వీచే చెట్టు గాలిలా తినే బువ్వలా 
నాదైన అస్తిత్వ చిరునామా

భాషలెన్నైనా రచనలో నిన్ను నన్ను తడిమినా 
శ్వాసకోశాల స్వచ్ఛగాలి నిమురుడే అమ్మభాష
సముద్రమంత లోతు విశాలం
ప్రేమంత మనసు మైదానం
బతుకున 
నా గుండెచప్పుడు మాతృభాష. 

=================================

(21-2-2026న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం...)

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాలా బాగా ఉంది మీ కవిత సందర్భోచితంగా. అభినందనలు మీకు