సాధన ఓ సాహస క్రీడ..!: - కవిరత్న,-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్.
భగవంతుని గద్దింపు...
నీ గెలుపుకు సంకేతం...
ఈ జీవితం ఆ పరమాత్మకే అంకితం...

నిప్పులపై నడక...
పాము పడగల కింద నిద్ర...
ఈ జీవితంలో అన్నీ అగ్నిపరీక్షలే... 
అడుగడుగునా గండాలే అగ్నిగుండాలే...

తగిలే ప్రతి దెబ్బ...
తర్ఫీదునిచ్చే ఓ గుణపాఠం...
ఈ జీవితం మానని గాయాలమయం...

సమస్యల సర్పాలు...
నీ ధైర్యానికి పడగలు...
ఈ జీవితం ఒక సమరం ఒక సంబరం...

నేడు స్పృశిస్తే మట్టి...
అది రేపటి బంగారు తొట్టి...
ఈ జీవితం ఒక వైరాగ్యం ఒక వైభోగం...

కత్తుల బోను...
నీ కండ బలానికి పరీక్ష..‌
ఈ జీవితం ఒక విశ్వాసం ఒక వీరత్వం...

నేటి ముళ్ళ కంచే...
రేపటి పూలబాటకి నాంది...
ఈ జీవితం ఒక సాహసం ఒక సంకల్పం...

నేటి ఈ కన్నీటి కష్టాలన్నీ...
రేపు కురిసే కోటివరాల వర్షం కోసమే...
ఈ జీవితం ఒక వరం...ఒక సంబరం...

నిన్న అందక‌ ఊరించిన ద్రాక్ష...
నేడు నీచేతిలో జారిన జామపండు...
ఈ జీవితంలో వీరులకేదక్కు విజయాలు..

నిన్న చేరాలనికున్న
ఆ ఉన్నత శిఖరం...
నేడు నీ పాదాల చెంతే...
ఈ జీవితంలో లక్ష్యసాధన ఓ సాహసక్రీడ..

కష్టాల 'కట్టె'ల్ని కాల్చెయ్...
ఓటమిని 'కొట్టి' పారెయ్...
విజయ సంపదను ఇంటికి 'తెచ్చె'య్!
ఈ జీవితానికిదే కదా ముత్యాలమూట...



కామెంట్‌లు