నాలుగు నవజీవన సూత్రాలు..?: - కవిరత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
నవ్వుతూ ఉండండి
నవ్వు ఉషోదయరవి కిరణంలా
చిమ్మ చీకట్లను చీల్చివేస్తుంది
అది మనసుమీద జలపాతంలా 
ముత్యాలతుంపర్లను చిలకరిస్తుంది

నవ్వితే పోయేదేముంది చెప్పండి..?
కారు మబ్బుల్లా పేరుకున్న
ఆందోళన కరిగిపోవడం తప్ప...

సంతోషంగా ఉండండి
సంతోషం వసంతమాసపు గాలిలా
హృదయాన్ని హాయిగా తాకుతుంది
అది లేతచిగురుటాకుల్లా
ఆశలను పచ్చగా మారుస్తుంది

సంతోషంగా ఉంటే
పోయేదేముంది చెప్పండి..?
ముళ్లకంపల సమస్యలు
పూలవనంలా మారడం తప్ప...

ఆనందంగా ఉండండి
ఆనందం గంగవాహినిలా
అంతరంగంలో ప్రవహిస్తుంది
అది చంద్రకాంతిలా
చల్లని శాంతిని చిమ్ముతుంది

ఆనందంగా ఉంటే
పోయేదేముంది చెప్పండి..?
అలజడుల అలలు ఆగిపోవడం  
కన్న కలలు నిజం కావడం తప్ప...

ఆరోగ్యంగా ఉండండి
ఆరోగ్యం పచ్చని వృక్షంలా
నవజీవనానికి నీడనిస్తుంది
అది అమృతధారలా
శరీరానికి శక్తినిస్తుంది

ఆరోగ్యంగా ఉంటే
పోయేదేముంది చెప్పండి..?
దీపశిఖలా దీర్ఘాయువు
వెలుగుతూ ఉండడం తప్ప.



కామెంట్‌లు