అక్షరాల ఇంద్రజాలం: - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అక్షర భ్రమలు —
మనసు అద్దాల్లో మెరుస్తూ,
భావాల ప్రతిబింబాల్ని
అనంతంగా తిరిగే చక్రాలుగా మలుస్తాయి.

అక్షర స్వప్నాలు —
నిద్రలేని కన్నుల్లోకి
నక్షత్రాల్ని దించి,
కవితల పూలవనాలు పూయిస్తాయి.

అక్షర కల్పనలు —
కల్పవృక్షాల నీడలో
అనుభూతుల ఊయలలు ఊగి,
అసాధ్యాన్నీ సుసాధ్యం చేస్తాయి.

అక్షర పన్నాగాలు —
సర్పిల వాక్యాల్లో
అర్థాల్ని బంధించి,
వేల భావాల్ని కూర్చుతాయి.

అక్షర స్మృతులు —
కాలపు గడియారాల వెనుక
నిలిచిన చిరునవ్వుల్లా,
హృదయాన్ని మళ్లీ మళ్లీ తాకుతాయి.

అక్షర స్తుతులు —
మౌనానికి మంత్రాలై,
వాక్కుకు వెలుగులై,
సృష్టిని ప్రశంసించే గానంగా మారుతాయి.

అక్షర వేటలు —
అజ్ఞాన అరణ్యాల్లోకి దూకి,
సత్యాల్ని పట్టుకుని,
చైతన్యపు దీపాలు వెలిగిస్తాయి.

అక్షర యుక్తులు —
తర్కానికి సౌందర్యాన్ని జోడించి,
బుద్ధికి భావాన్ని కట్టించి,
వాక్యాన్ని వజ్రంలా తీర్చిదిద్దుతాయి.

అక్షర సూక్తులు —
చిన్న వాక్యాల పొదల్లో
జీవితపు సారాన్ని దాచి,
యుగాల్ని దాటింటే దారులవుతాయి.

అక్షర రాతలు —
కవికలంనుంచి జారి,
హృదయపు శ్వాసలై
కాలంపై చెక్కిన చిరునామాలవుతాయి.

అక్షర మాయాజాలం —
నా కలం పలికిన క్షణం నుంచీ
భాషకు శ్వాస, భావానికి రూపం,
కాలానికి కవితగా మారుతుంది.

అక్షరమే నా ఆత్మ,
కవితనే నా గుర్తింపు —
నా శ్వాస ఆగే వరకూ
ఈ అక్షర మాయాజాలం కొనసాగుతుంది.

.

కామెంట్‌లు