“అచ్యుత: ప్రధిత: ప్రాణ: ప్రాణదో వాసవానుజ
అపాం నిధిరధిష్ఠాన మప్రమత్త:ప్రతిష్ఠిత:
“ఇప్పటివరకు నేర్చుకున్న శ్లోకాలన్నీ..ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చొప్పున చెప్పండి” అంది బామ్మ.
పిల్లలు చెప్పటం మొదలు పెట్టాక..”అజ సర్వేశ్వర: సిద్ధ:సిద్ధి: సర్వాదిరచ్యుత:” అని హరి చెప్పగానే..బామ్మ “ఆగు, ఆగు” అని ‘సర్వాదిరచ్యుత:’ అంటే మనం ఏం చెప్పుకున్నామో ఎవరికైనా గుర్తు ఉందా” అని అడిగింది.
“నాకు గుర్తు ఉంది బామ్మా” అని “జీవులు అన్నీ పుట్టి, ఉండి, పెరిగి, మార్పు చెంది, క్షీణించి,నశిస్తాయి. అందుకు కారణం.. జీవులన్నిటికీ ఆరు రకాల లక్షణాలు ఉంటాయి. వాటిని ‘షడూర్ములు’ అంటారు. అవి ఆకలి, దప్పిక, దు:ఖం, మోహం, ముసలితనం, మరణం. వీటి వల్లనే జీవుల్లో మార్పు నిరంతరం జరుగుతూ ఉంటుంది.” అన్నాడు హరి.
“అవును..నీకు బాగా గుర్తుంది. భేష్! ఈ లక్షణాలు ఏవీ లేని శ్రీ మహా విష్ణువుని ‘అచ్యుత’ అంటే ‘చ్యుతి’ లేని వాడు అంటారు. అందుకే ఎప్పటికీ తన ఉనికితో ఈ జగత్తుని సృష్టించి, నిర్వహించి, లయం చేస్తూ ఉంటాడు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. జీవులలో ఉండే ప్రాణ శక్తి ఆ దేవ దేవుడే అని చెప్పుకున్నాం కదా! ప్రాణం లేని జీవిని ‘శవం’ అంటారు అని తెలుసు కదా!” అన్నది బామ్మ.
‘ప్రాణదో వాసవానుజ:’ అంటే ప్రాణాలు ఇస్తాడు, ప్రాణాలు తీసుకుంటాడు కూడా” అని బామ్మ చెప్పగానే..”ఆమ్మో ప్రాణాలు తీసుకుంటే మనం చచ్చిపోతాం కదా” అన్నది చిట్టి.
“అందరి ప్రాణాలు తీసుకుంటాడు అని కాదు అర్థం. మనకి, దేవతలకి కూడా ప్రాణ శక్తి ఇస్తాడు. తప్పు చేసి, అధర్మంగా ప్రవర్తించి జీవులని బాధించే వాళ్ల ప్రాణాలు తీసుకుంటాడు. ప్రాణాలు తీసుకునే దైవ స్వరూపం ఎవరు” అని అడిగింది బామ్మ.
‘యమధర్మ రాజు’ అని చెప్పి.. “ప్రాణాలు తీసుకునేది యముడు కానీ శ్రీ మహా విష్ణువు కాదు కదా” అనే ధర్మ సందేహం వెలిబుచ్చాడు గోపాల్.
“యముడు అన్నా, సూర్య చంద్రులన్నా, అష్ట దిక్పాలకులన్నా, అశ్వినీ దేవతలన్నా ..అన్నీ ఆ దేవదేవుడి తత్వాలే! చేసే పనిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు. ఇంతకు ముందు మీకు చెప్పాను కదా..ప్రభుత్వం ఒక్కటే కానీ ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, నీటి పారుదల శాఖ..ఇలా వేరు వేరు రూపాలతో పని చేస్తుందన్నమాట.”
“అలా సృష్టి, స్థితి, లయలు నిర్వహించే దేవదేవుడు..అదితి కశ్యపులకి వామన రూపంలో జన్మించాడు. అలా జన్మ తీసుకున్నప్పుడు ఆయన మహేంద్రుడికి తమ్ముడు అవుతాడు” అని బామ్మ చెప్పగానే..”ఆ:( వామనుడు తప్పు చేసిన బలి చక్రవర్తిని, మూడు అడుగుల దానం అడిగి, ఆయన తలమీద కాలు పెట్టి పాతాళంలోకి తొక్కేశాడు కదా..పాపం” అన్నాడు పవన్.
“పాపం ఏముంది..తప్పు చేసిన ఎవరినైనా ఆ స్వామి అలాగే శిక్షిస్తాడు. సరే ఇప్పుడు “అపాంనిధి రథిష్ఠాన మప్రమత్త: ప్రతిష్ఠిత:” అంటే అపాంనిధి అంటే..నీటికి నిధి వంటి వాడు. సృష్టిలో ఉన్న జలరాశులన్నీటికీ..నదులు, సముద్రాలు..అందులో ఉండే అన్ని జీవులు, వాటి ప్రాణ శక్తి అన్నింటికీ ఆయనే నిధి అన్నమాట. అలా సృష్టి ప్రారంభంలో ఒక్క నీరే ఉండేది. ఆ నీటికి ప్రాణ శక్తి లేకపోతే..అందులో నించి జీవ రాశులు పుట్టవు కదా! కాబట్టి నీటిలోని బ్రహ్మం ఆయనే! అలా అన్నిటా తానే చైతన్యం అయి ఉండే ఆ పరమాత్మ ఎప్పుడూ జాగరూకతతో ఉంటాడు. అశ్రద్ధ, అలక్ష్యంతో ఉండడు. అలా సృష్టిలోని అన్ని జీవులు తమ పని తను చేసుకునేలా తన మహిమ చూపిస్తూ, నిలకడగా ఉంటాడు.”
“ఉదాహరణకి మీ టీచర్ మీకు పాఠాలు బోధించి, అవి మీకు అర్థమవుతున్నాయో లేదో గమనిస్తారు. మధ్య మధ్యలో నెల వారీ పరీక్షలు పెట్టి నేర్చుకున్నవి మీకు గుర్తు వుంటున్నాయో లేదో తెలుసుకుంటూ ఉంటారు. అవునా..అదే “అప్రమత్త: ప్రతిష్టిత:” అంటే! మనకి మనిషి జన్మ వచ్చే అవకాశం ఇచ్చి, మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామో లేదో గుప్తంగా గమనిస్తూ ఉంటాడు. భరించలేని తప్పు చేసినప్పుడు శిక్షించి బుద్ధి చెబుతాడు. అయినా వారిలో మార్పు రాకపోతే వారికి మరణమే శిక్షగా చేస్తాడు. ఎలా అంటే సరిగ్గా చదువుకోకుండా నిర్లక్ష్యంగా ఉండే విద్యార్థిని సంవత్సరం ఆఖరి పరీక్షల్లో ఫెయిల్ చేసినట్టు అన్నమాట. అందుకే చదువుకోవడానికి మీకు దొరికిన మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని, మంచి మంచి విషయాలు నేర్చుకుని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి. తెలిసిందా? ఇక ఇళ్ళకి వెళ్ళండి” బామ్మ పిల్లలని పంపించేసింది.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి