సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము- 240 వ రోజు
రెండవ అశ్వాసం
ఇలా తన పక్షానికి కలిగిన విజయానికి సంతోషించిన ధృతరాష్ట్రుడు సంజయుని చూసి " సంజయా ! ఆపై యుద్ధం ఎలా జరిగింది చక్కగా వివరించుము " అని ఉత్సాహంగా అడిగాడు. సంజయుడు ఇలా చెప్పసాగాడు. " ఆరాత్రి ధర్మరాజు మొదటి రోజునే తమకు ఓటమి సంభవించి నందుకు దుఃఖిస్తూ తమ్ములతో సహా శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని చూసి " కృష్ణా! చూసావు కదా భీష్ముడు కార్చిచ్చు వలె మన సేనలను కాల్చి వాసాడు. మనకు అతడిని చంపు మార్గం కనిపించుట లేదు లోక భీకరుడైన అతడిని సాధారణ వీరునిగా తలచి భంగపడ్డాను. నీ మరుదులు బాగా గాయపడ్డారు. భీష్మునితో యుద్ధం చేయడానికి దిక్పాలకులు చాలరని మనకు తెలిసింది. భీష్ముని గెలవగలడని మనం అర్జునిని నమ్ముకున్నాము. ఈ రోజు అర్జునుడు తన పరాక్రమం ఏమీ చూప లేదు. భీముడు తన యావచ్ఛక్తి ఉపయోగించి యుద్ధం చేసాడు. నాకు ఏమి చేయాలో పాలు పోవడం లేదు. అయినా ఎవరిని అనుకుని లాభం ఏమిటి ? మనకు సాయంగా వచ్చిన రాజులను భీష్మునికి ఎర వేయడం కంటే యుద్ధం మానుకుని ఆకులు అలములు తినడం మేలు. నీ వలన ఇప్పటి వరకు అపజయమెరుగక మేము క్షేమంగా ఉన్నాము. కనుక నీవు ఎలా చెపితే అలా చేస్తాము. మాకు కర్తవ్యం నీవే నిర్ణయించు " అని వేడుకున్నాడు. ధర్మనందనుని భయాన్ని పోగొట్టే విధంగా శ్రీకృష్ణుడు " ధర్మరాజా ! ఏమిటి ఈ ఆవేదన ఎందుకు చెప్పు. నీకు ఎదురు నిలువ గల సమర్ధులు ఎవరు. నీ తమ్ములు మూడు లోకాలను గెలువ సమర్ధులు. భీష్ముని చంపడానికి శిఖండి ఉన్నాడు భయ మెందుకు. సాత్యకి పరాక్రమం ఆశ్చర్యకరమైన అతని యుద్ధ రీతులు నీకు అవగతం కాలేదు. దృపదుడు, విరాటుడు నీకై తమ ప్రాణములు సహితం ఇవ్వ సిద్ధంగా ఉన్నారు. నీవు నిరుత్సాహ పడవద్దు. దృష్టద్యుమ్నుడు పరాక్రమానికి కౌరవ సేన నిలువజాలదు " అన్నాడు. ధర్మరాజు దృష్టద్యుమ్నుని చూసి " నాడు కృష్ణుని ఆదేశం పై నిన్ను సర్వ సైన్యాలకు అధ్యక్షుని చేసాము. శ్రీ కృష్ణుడు, నేను, నా సోదరులు, మిత్ర రాజులు నీకు సాయం ఉంటాము. నీ సర్వ శక్తులు ఒడ్డి మాకు విజయం చేకూర్చు " అన్నాడుధృష్టద్యుమ్నుడు" ధర్మనందనా! నన్ను ద్రోణుడిని చంపుటకు మాత్రమే బ్రహ్మ శృష్టించిన విషయం జగమెరిగిన సత్యం. భీష్మునితో చేర్చి కురు సేనలను ఎలా మట్టు పెట్టగలనో చూడు " అన్నాడు. ఆ మాటలు విన్న పాడవులు, మిత్రరాజులు సంతసంచారు. ధర్మరాజు దృష్టద్యుమ్నునితో " పూర్వం దేవదానవ యుద్ధమున దేవేంద్రుని కొరకు బృహస్పతి పన్నిన అతి భయంకర మయిన క్రౌంచ వ్యూహమును రేపటి యుద్ధములో మనసైన్యం కొరకు నీవు పన్నుము " అన్నాడు. తేలిక పడిన మనసుతో ధర్మనందనుడు తన తమ్ములతో స్థావరానికి వెళ్ళగానే అందరూ తమ తమ నివాసములకు వెళ్ళారు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు