బెర్నార్డ్ షా : - - యామిజాల జగదీశ్
 బెర్నార్డ్ షాలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక గుణం ఉండేది. అదే, ఎలాంటి అవార్డులు లేదా బిరుదులు కోరుకోని అతని విచిత్రమైన స్వభావం. అవును! నోబెల్ బహుమతి తన వద్దకే వచ్చినప్పుడు కూడా దాన్ని తిరస్కరించింది బెర్నార్డ్ షానే అని మీరు నమ్మగలరా? కానీ అది నిజం!
ఆ అద్భుత సంఘటన జరిగిన సంవత్సరం 1925. నోబెల్ బహుమతి కమిటీ బెర్నార్డ్ షాను సంప్రదించి, ఆ సంవత్సరానికిగాను సాహిత్యానికి నోబెల్ బహుమతిని ఆయనకు ఇవ్వాలనుకుంటున్నామని తెలియజేసినప్పుడు, షా ఆనందంతో ఎగిరి గంతులు వేయలేదు. దానికి బదులు ఆయన ఇలా బదులిచ్చారు, “ఈ సంవత్సరం నోబెల్ బహుమతి నా కోసమా... ఎందుకూ...ఏంటీ? నేను ఈ సంవత్సరం ఏమీ రాయలేదు కదా.”
మరోవైపు, బహుమతి కమిటీ ప్రతినిధులు “ఒకవేళ మీరు ఈ సంవత్సరం రాయకపోతేనేం? ఈ నోబెల్ బహుమతి మీరు ఇప్పటికే రాసిన దాని కోసమే కదండీ!” అని అన్నారు.
దానికి జార్జ్ బెర్నార్డ్ షా గట్టిగా నవ్వి, “సముద్రం మధ్యలో ఒడ్డుకు చేరడానికి పోరాడుతున్న ఒక వ్యక్తిని కాపాడటానికి రబ్బరు గొట్టం ఇవ్వడం లాంటిది ఈ బహుమతి” అని అన్నారు.
 ఆ తర్వాత, తనదైన వ్యంగ్య ధోరణితో ఆయన బహుమతిని తిరస్కరించారు.
అయినప్పటికీ, ఆయన నోబెల్ బహుమతితో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఏం చేశారో తెలుసా... ఆయన దానిని మరొక రచయితకు ఆయన సాహిత్య కృషికి ఇచ్చేశారు!
జార్జ్ బెర్నార్డ్ షా 1856 జూలై 26 వ తేదీన జన్మించారు. తన పట్టుదల మేరకు బెర్నార్డ్ షాగా ప్రసిద్ధి చెందారు. ఈయన ఐరిష్ నాటక రచయిత. విమర్శకుడు. రాజకీయ కార్యకర్త. పాశ్చాత్య నాటకరంగం, సంస్కృతి, రాజకీయాలపై ఆయన ప్రభావం 1880ల నుండి ఆయన మరణం వరకు, ఆ తర్వాత కూడా కొనసాగింది. ఆయన 'మ్యాన్ అండ్ సూపర్‌మ్యాన్' (1902), 'పిగ్మాలియన్' (1913), 'సెయింట్ జోన్' (1923) వంటి ప్రధాన రచనలతో సహా అరవైకి పైగా నాటకాలను రాశారు. సమకాలీన వ్యంగ్యం, చారిత్రక రూపకాలంకారాలను రెండింటినీ మేళవించిన తన రచనలతో , షా తన తరంలో అగ్రగామి నాటక రచయితగా ఎదిగారు. 1925లో ఆయనకు సాహిత్యానికి నోబెల్ బహుమతి లభించింది. ఆయన 1950 నవంబర్ రెండో తేదీన తుదిశ్వాస విడిచారు.

కామెంట్‌లు