సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -212: ఆలు లేత - నారు ముదురు ఉండాలి...
****
"అవ్వా! నువ్వేమన్న అన్కో గని గిందుల నైతే మొగోళ్ళ సార్దముందని బాజాప్త జెప్త. లేకుంటే గింత తేడా జేత్తరా? కొన్ని మాటలు గాళ్ళ అవుసురాల కోస్రమే పుట్టించిండ్రని అనిపిస్తది.
ఏంది శెల్లే! ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టు ఉన్నట్టుండి గాళ్ళమీద పడ్డవు. గీ యిష్యం గిప్పుడే కొత్తగ కనిపెట్టినట్టు శెప్తున్నవ్.గింతకీ ఏమైంది?
"అవునవ్వా! మా సూరయ్య మావోళ్ళ మాటలిన్నంక, గాళ్ళు సూత్తున్న పెండ్లి సంవందాల యిష్యం తెల్శింతర్వాత మన్సులో ఏదో శెప్పరాని బాదవ్వా !.
"శెల్లే గాళ్ళ మాటలేమిన్నవ్? గింతకీ నీకు తెల్శిందేందో ముక్కుసూటిగా శెప్పక గా డొంక తిరుగుడు ఏంది శెల్లే?
"గదే అవ్వా!  సూరయ్య మావఁ పెద్ద కొడుకు  మల్లేశు ఉండుగద.గానికి ముప్పై ఏండ్లు వత్తున్నయి. గిప్పటి దనుక ముప్పై సంవందాలు సూశి వుంటరు. ఈడు జోడు బాగున్న సంవందాలు ఎందుకు వొద్దన్నరో తెల్సా అవ్వా! గాళ్ళకి పెండ్లిపిల్ల లేతగుండాలంట. వొయసు తేడా శానా ఉండాల్నట. గదేందంటే గంతే గట్ల దొర్కిన పిల్లనే శేత్తమని అన్నరు. గాడేమో బెండకాయ ముదిర్నట్టు ముదొరొచ్చు గని ఆడివిల్ల మాత్తరం లేతగుండాలంట.గిదేం సార్తం.
 "గింత అన్నేలంగున్న గాళ్ళ ఆలోచనకి మన్సు మండిందనుకో. నువ్వే శెప్పవ్వా? గది నాయమేనా?
"ఓషినీ నీ బుగులు నాకు అర్తమైంది శెల్లే. "ఆలు లేతగుండాలే అన్నదే గద నీ బాద. ఎన్కటోళ్ళు" ఆలు లేత - నారు ముదురు కావాలనేవారట"
గట్లెందుకు అవ్వా? గదే నాకు ‌సమజవ్వలే. నా దృట్టిలో లేతగున్న అడివిల్లను జేస్కుంటే శాన్నాళ్ళు పైసా కర్సు లేకుండా శాకిరి చేయిచ్చుకోవచ్చని ఆశ. గిప్పటికే బండెడు శాకిరి చేయిచ్చుకుంటనే ఉండ్రు!గిది శానా అన్నాలం కాదా అవ్వా? నువ్వే శెప్పు"
"గదా శెల్లె నీ అనుమానం.ఆడవిల్లల తల్కాయల మెదడు మొగ పిల్లల కంటే ఐదేళ్ళ ముందు ఉంటదంట.ఇల్లు సవరిచ్చే కానించి సమత్తం మొగోళ్ళ కంటే మంచిగ తెల్వి తేటలుంటయంట.గందుకే   మొగ మనిషికి  ఐదారేండ్లు తక్వున్న ఆడివిల్లను ఇచ్చి లగ్గం చేస్తరు. గందుకే  ఆలు లేత  గావాలంటరు. గట్ల ఎన్కటెన్కటి నుంచి ఆచారంగా వత్తోంది.
గిప్పుడు శానా మట్కి  ఈడూ జోడూ ఉండాలనీ ఒక్కొయసు, ఒకట్రెండు ఏండ్ల వొయసు తేడా మాత్తరమే ఉండేటట్ఠు సూస్కుంటున్నరు  శెల్లె.
 "ఇంగ నారు కొంచెం ముదిరితే పొలంల నాటితే మంచిగ నాటుకుంటదంటరు. అందుకే"ఆలు లేత - నారు ముదురు" అన్నారు.
గదండీ సంగతి! *"ఆలు లేత నారు ముదురు" అంటే గిదే మరి.

కామెంట్‌లు