ఓ సీతాకోకా!… (గజల్ – మిశ్ర గతి, లయబద్ధం): - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
ముందుకు రావే మధురిమగా సీతాకోకా
మనసును తాకే సరసిమగా సీతాకోకా

రెక్కలు విప్పి రంగులుగా విరిసెదవే
ఆకాశమంతా అందముగా సీతాకోకా

గాలిలో తేలే గీతముగా ఊగెదవే
నవ్వుల జాబిలి వెలుగుగా సీతాకోకా

పూలపై వాలి పరిమళమై పలికెదవే
తేనెల తీయని రుచిగా సీతాకోకా

చిన్న జీవితం చిలిపి గానమై సాగెదవే
స్వేచ్ఛ సందేశ రూపముగా సీతాకోకా

నిశ్శబ్దంలోనూ నాదమై వినిపించెదవే
హృదయానంద హారముగా సీతాకోకా

రంగుల కలలతో లోకమును మాయచేయవే
ప్రకృతి కవిత్వ రూపముగా సీతాకోకా

“రాజేంద్ర” హృదయంలో రాగమై నిలిచెదవే
కవితా పుష్ప సుగంధముగా సీతాకోకా


కామెంట్‌లు