సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -221":- ఆ తుష్ఠికీ యీ నష్ఠికీ సరి"
***
"ఇదిగో అవ్వా! గిదిన్నవా?  మొత్తం లాచారై తల్కాయ బట్టుకుండట." కాలం ఎప్పుడూ ఒక్కలాగుండదయ్యా ఇంగ సాలు ఉన్నదాంట్లో సుఖంగా బత్కుదామని" శెవినిల్లు గట్టుకొని శెప్పిందట. "శెప్తే ఇనడాయే వొంట బుట్టదాయె" ఏం జెయ్యను కోడలా!"  అని మస్తు రంది వడ్తున్నదవ్వా!"
 " గింతకీ ఎవలు శెల్లె?గంత గనం  లాశారైంది? ఏ యాపారం జేసిండేంది? "
 " గా గోపయ్య మావఁ అవ్వా! గాయన జేసేది ఒక్క యాపారం గాదు. ఏద్దొరికితే గదే జేసుడు. ఇంట్లె అత్త నెత్తి నోరు గొట్టుకొని మంచి శెడు సూస్కొని యాపారం జెయ్యాలె గని,గా యాపారాల వల్ల ఎవలికి కీడు జరగొద్దని శెప్తనే ఉందట. ఇంటె గద."
 " కూలికి నాలికి పోనియ్యకుండ ఇంట్లె కూసబెట్టి సాత్తున్న. గాడిదయ్యో బూడిదయ్యో సంపాయిచ్చుకుంట వొత్తుంటే నాకే ఎదురు శెప్తావ్" ఊ అంటే ఆ అంటే కయ్యానికి కాలు దువ్వుడట.""
"గిప్పుడు బాగనే శాత్తి అయ్యింది మావఁకి." "శేతులు కాలినంక ఆకులు పట్కుంటే ఏం లాభం" అవ్వా?" పెళ్ళాం, పిల్లల మాటలు యిననైతిని అని నెత్తిన గుడ్డేసుకుండట."
మా బాగ అయ్యింది శెల్లే! ఎన్ని యాపారాలు జేసినా ఏమన్పియ్యలే గని బాగా డబ్బులొత్తయని గా మత్తు శాక్లెట్లు అమ్మేటోళ్ళతో శేయి గలిపి పెద్ద బల్లె సద్వే పొల్ల గాండ్లకీ,కాలేజీ పోరలకి సాటుగ అమ్ముడు మొదలు వెట్టిండంట. గది తెల్శి " అరికాలి మంట నెత్తికెక్కిందన్కో."
"సేశిన పాపం ఊకెనే బోతదా శెల్లే?పోలీసోల్లకి పట్టువడ్డడు.మక్కెలిరిగేటట్టు తన్నిచ్చు కునే కాడికొచ్చిందట. అన్నేలంగ సంపాయిచ్చిన సొమ్మంత గాళ్ళకి కట్టిండంట .బాగ తెల్శిన పెద్ద మడిషి కాల్లేల్ల బడి"సావు తప్పి కన్ను లొట్టబొయ్యినట్టు"  జైలు శిచ్చ తప్పిచ్చుకుని ఇంట్లె కూసున్నడు."
అవునవ్వా? గియ్యన్ని నీకెట్ల దెల్సినయి. నీకు భలే తెలుత్తయి. ఎవలు జెప్పిండ్రవ్వా?"
కంపయినా,యింపయినా దాత్తే దాగుతయా శెల్లె?"
"అవువవ్వా! ఎందుకు దాగుతాయి?"లాభం గూబలకి గుంజింది పో!"
గందుకే మనపెద్దోళ్ళు ఊకెనే అన్లే "ఆ తుష్ఠికీ యీ నష్ఠికీ సరి"అని.
" అంటేందవ్వా  సమజవ్వలే.తుష్ఠేంది? నష్ఠేంది?"
"తుష్ఠంటే తుత్తి,లాబం శెల్లే.గట్లనే నష్ఠి అంటే నట్టం.
"మందినోళ్ళుగొట్టి అదర్గనంగ సంపాయిత్తే గిట్లనే అయితది శెల్లే."
 "మా బాగయింది అవ్వా! గట్లనే జైలూసలు సుత లెక్క బెడితే బాగుండవ్వా!"
గదండీ సంగతి ’ ఆ తుష్ఞికీ యీ నష్ఠికీ సరి "అంటే గిదే మరి.

కామెంట్‌లు