సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 
భీష్మ పర్వము తృతీయాశ్వాసము:- 266 వ రోజు
కురు పాండవ వీరుల పోరు
భీష్మునికి అర్జునునికి మధ్య పోరు ఘోరరూపందాల్చింది. ఇంతలో కృపాచార్యుడు అభిమన్యునిపై శరవర్షం కురిపించాడు. వెంటనే సాత్యకి కృపాచార్యుని శరములు త్రుంచి అనేక కౄర బాణములు అతడిపై ప్రయోగించాడు. వాటిని అశ్వత్థామ మధ్యలోనే త్రుంచి సాత్యకి విల్లును త్రుంచాడు. వెంటనే సాత్యకి మరొక విల్లు అందుకుని అశ్వత్థామ మూర్చిల్లేలా ఒక క్రూరబాణంతో కొట్టాడు. అశ్వత్థామ వెంటనే తేరుకుని సాత్యకి గుండెలకు గురి పెట్టి శరసంధానం చేసి అతడి కేతనమును విరిచి భీకర ఘర్జన చేసాడు. ఆగ్రహించిన సాత్యకి అశ్వత్థామ రథం కనిపించ కుండా కొట్టాడు. అది చూసిన ద్రోణుడు సాత్యకి శరవర్షం కురిపించాడు. అది చూసి అర్జునుడు సాత్యకికి సాయం వచ్చి ద్రోణుని ఎదుర్కొన్నాడు. " అని సంజయుడు చెప్పగా దృతరాష్ట్రుడు " సంజయా ! అర్జునుడు ద్రోణుని ప్రియ శిష్యుడు కదా ! అర్జునినికి ద్రోణుడంటే గురుభక్తి అధికం . మరి వారిరువురు ఎలా యుద్ధం చేసారు " అని అడిగాడు. సంజయుడు అర్జున ద్రోణుల మధ్య జరిగిన యుద్ధం వర్ణించసాగాడు. " మహారాజా ! క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధభూమిలో తలపడిన తరువాత గురువు, తండ్రి, తమ్ములు, పుత్రులు, పౌత్రులు, శిష్యులు, మామలు అనే భేదం విడిచి యుద్ధం చేయాలి కనుక అర్జునుడు, ద్రోణుడు యుద్ధ భూమిలో శత్రువుల వలెనే యుద్ధం చేసారు. అర్జునుడు ద్రోణునిపై మూడు క్రూర నారాచములు ప్రయోగించాడు. ద్రోణుడు వాటిని త్రుంచి అర్జునిపై శరవర్షం కురిపించాడు. సుయోధనుని ప్రేరణపై త్రిగర్తాధిపతి ద్రోణుని దాటి పోయి అర్జునిపై భల్ల బాణములు ప్రయోగించాడు. అర్జునుడు ఆ బాణమును మధ్యలో త్రుంచి త్రిగర్తాధీశుని సైన్యంపై వాయవ్యాస్త్రమును ప్రయోగించాడు. ఆ వాయవ్యాస్త్రధాటికి త్రిగర్తాధీసుని సైన్యం చెల్లాచెదురు అయింది. ద్రోణుడు వాయవ్యాస్త్రానికి విరుగుడుగా శైలాస్త్రం సంధించి దాని ప్రభావాన్ని తగ్గించాడు. అది చూసిన అర్జునుడు వాడి అయిన బాణములను ప్రయోగించి త్రిగర్తాధీసుని కుమారులను తరమి కొట్టాడు. అది చూసిన సుయోధనుడు కృపాచార్యుడు, బాహ్లికుడు, శల్యుడు మొదలైన రథికులతో చేరి అర్జునిని ఎదుర్కొన్నాడు. సుయోధనాదులనే కాక ద్రోణుని కూడా తన వాడి శరములతో అర్జునుడు చికాకు పరిచాడు. ఇంతలో భీష్ముడు అర్జునుని ఎదుర్కొని అతడిపై శరవర్షం కురిపించి తన క్రూర బాణములతో వేలకు వేల శత్రువుల శిరస్సులను ఖండించాడు. మరొక పక్క శకుని, భూరిశ్రవనులు నకుల సహదేవులను ఎదుర్కొన్నారు. కళింగరాజు, భగదత్తులు తమ గజబలంతో భీమునితో పోరుతున్నారు. కొండ మీద నుండి దూకే సింహంలా భీముడు రథం నుండి కిందికి దూకి గజ సైన్యముల కుంభస్థలములను పగుల కొడుతున్నాడు. భీమసేనుని గదాఘాతముకు గజబలం బెదిరి పారి పోయాయి. శ్రుతాయువు, భగదత్తులు వాడి అయిన బాణాలతో భీమసేనుని కవచం చీల్చారు. మరొక వైపు భీష్ముడు పాండవ సైన్యాలను చెండాడుతున్నాడు. ఇది గమనించిన ధర్మరాజు భీముని రమ్మని చెప్పాడు. భీముడు కళింగ రాజు, భగదత్తులను విడిచి అన్నయ్య దగ్గరకు వచ్చాడు. ముందే విరాటుడు, దృపదుడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి అక్కడకు చేరి ఒక్కుమ్మడిగా భీష్ముని ఎదుర్కొన్నారు. భీష్ముడు శిఖండిని వదిలి వారిని ఎదుర్కొని శరములు వేయసాగాడు. రథికులు ప్రతిగా శరములు వదులుతున్నారు . పోరు సంకలమైంది.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు