ఆరుబయట మల్లెచెట్టు కింద నులకమంచం మీద నాయనమ్మ మనవరాలు పడుకుని ఉన్నారు.
నిద్రపోకుండా ఆలోచిస్తున్న మనవరాలిని చూసి ఏంటి బంగారం నిద్ర రావడం లేదా అని అడిగింది నాయనమ్మ.
లేదు, ఏదో ఒక కథ చెప్పు నాయనమ్మ అంది చిన్నారి.
సరే చెప్తాను విను అంటూ...
అనగనగా ఒక రాజు. ఆయనకి ఇద్దరు భార్యలు. పెద్దభార్యకి తల్లో వెంట్రుకలు అన్ని రాలిపోయి కొన్నే మిగిలాయి.
చిన్నభార్యకి కూడా అలాగే వెంట్రుకలు అన్ని రాలిపోయి కొంచం ఎక్కువ మిగిలాయి.
అంటే సగం బట్టతల అంతే కదా అంది చిన్నారి.
ఆ అంతే అంతే ముందు కథ విను....ఆ రాజ్యంలోకి ఒక సాధువు వచ్చాడని అందరికీ మంచి వైద్యం చేస్తున్నాడని తెలుసుకున్న పెద్ద భార్య ఆ సాధువు దగ్గరికి వెళ్ళి జుట్టు లేకపోవడం వల్ల రాజుగారు తన మొహం చూడటం లేదని తన బాధని చెప్పుకుంది.
అప్పుడు ఆ సాధువు తూర్పు దిక్కున గా అడవిలోకి వెళ్ళు నీకు శుభం జరుగుతుంది అని చెప్పాడు.
ఆ సాధువు మాటలు విన్న పెద్ద రాణి అడవిలోకి వెళ్ళి తూర్పు దిక్కున నడవటం మొదలు పెట్టింది.
కొంతదూరం వెళ్ళేసరికి అక్కడ ఒక అడవి పిల్లి ఏడుస్తూ కనిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది పెద్ద రాణి ఆ పిల్లిని..
నాకు నిన్నటినుండి తినడానికి ఏమి దొరకలేదు అంది ఆ పిల్లి.
సరే ఉండు అని చెప్పి అక్కడ రాలిపోయి ఉన్న ఆకులతో డోప్పను చేసి తనదగ్గర ఉన్న చేతిసంచిలోంచి పాలుతీసి పిల్లికి పోసింది.
ఆ పిల్లి ఆ పాలు తాగి ఎక్కడిదాకా అని అడిగింది. విషయం మొత్తం చెప్పింది పెద్ద రాణి.
అయితే నువ్వు ఆ కనిపిస్తున్న కొండ దగ్గరికి వెళ్ళు నీకు శుభం జరుగుతుంది అని చెప్పింది.
రాణి బయలుదేరి కొండవైపు నడుస్తుంది. చెట్టుమీద నుండి ఒక కోతిపిల్ల తన ముందు పడిపోయింది. అది చూసిన రాణి అయ్యో అంటూ దాన్ని తన చేతిలోకి తీసుకుని చూసింది.
ఆ కోతిపిల్ల కాలికి దెబ్బ తగిలి ఉండటం వల్ల అది నడవలేక పోతుందని గమనించి ఆ దెబ్బమీద, అక్కడే దాపుల్లో ఉన్న చెట్ల ఆకుల రసాన్ని రాసి, ఆకులు పెట్టీ చెట్ల వేర్లతో కట్టి కట్టింది.
ఆ కోతిపిల్ల కృతజ్ఞతగా చూసి... ఈ అడవిలో నీకేం పని అని అడిగింది.
తన విషయం మొత్తం చెప్పింది ఆ రాణి.
శ్రద్ధగా విన్న ఆ కోతిపిల్ల నీకు ఒకటే దారి ఆ కనిపిస్తున్న కొండ దగ్గరికి వెళ్ళు అని చెప్పింది.
మళ్ళీ పెద్దరాణి నడవటం మొదలు పెట్టింది.
కొండ దగ్గర పడటంతో అక్కడ చెట్టుకింద విశ్రాంతి తీసుకుందామని కూర్చుంది.
గండు చీమ ఒకటి రాణి ముందుకి వచ్చి నా స్థలంలో ఏం చేస్తున్నావు అంటూ ప్రశ్నించింది.
విషయం అంతా వివరంగా చెప్పింది రాణి చీమకి.
ఓస్ అంతేనా...నాతోరా నీకు మార్గం నేను చూపిస్తా, కానీ దానికంటే ముందు నిన్న వర్షం పడి మట్టి చేరి మా చీమలన్నింటికి ఆహారం లేదు.అవి చాలా ఆకలిగా ఉన్నాయి. నువ్వు వాటి ఆకలి తీరిస్తే నేను నీకు దారి చెప్తాను అంది ఆ గండు చీమ.
తను తినడానికి తెచ్చుకున్న రొట్టెలు, పంచదార ఆ చీమలకు ఇచ్చింది పెద్ద రాణి.
అప్పుడు ఆ గండుచీమ రాణి నీ తీసుకు కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ వున్న ఆకులను చూపి వీటి పసరు రాసుకో నీకు జుట్టు వస్తుంది అని చెప్పింది.
రాణి ఆ ఆకులను తెంపి తన సంచిలో వేసుకుని, చీమలు కృతజ్ఞతలు చెప్పి రాజ్యానికి తిరిగి వచ్చింది.
కొన్ని రోజులకు పెద్ద రాణి పెద్ద జుట్టుతో రాజుముందుకు వచ్చి నిల్చుంది.
రాజు, చిన్నరాణి ఆశ్చర్యపోయారు. తనకి కూడా జుట్టు కావాలని పట్టుబట్టింది చిన్నరాణి.
పోనిలే పాపం అని పెద్దరాణి, తాను కలిసిన సాధువు గురించి చెప్పింది.
ఆ రోజే చిన్నరాణి సాధువు దగ్గరికి వెళ్ళి తనకి కూడా జుట్టు కావాలని అడిగింది. పెద్దరాణి కి చెప్పినట్టుగానే చిన్నరాణి కి కూడా చెప్పాడు సాధువు.
చిన్నరాణి అడవిలోకి రథం వేసుకుని వెనక పదిమంది సైనికులను తీసుకుని బయలుదేరింది. తనకి కూడా అడవి పిల్లి ఎదురు అయ్యి ఆకలిగా ఉంది అని చెప్పింది.
చిన్నరాణి తన సైనికులకు చెప్పి దాన్ని తరిమింది. కొంతదూరం వెళ్ళగానే కోతిపిల్ల కాలికి దెబ్బతో ఎదురు అయింది. దాన్ని అలాగే తీసి పక్కన పడేయండి అని సైనికులకు చెప్పింది.
రాణి చెప్పింది కదా అని సైనికులు అలాగే చేశారు. ఇంకొంచం ముందుకు వెళ్ళగానే విశ్రాంతి కోసం చెట్టుకింద ఆగింది.
గండుచీమ వొచ్చి ఇది నా స్థలం ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని ప్రశ్నించింది చిన్నరాణి ని..
దానికి కోపంగా చిన్నరాణి సైనికులతో చెప్పి చంపించేసింది.
ఆ తరువాత అడవంతా ఎంత వెదికినా ఆ ఆకులు దొరకలేదు చిన్నరాణి కి, అలా చాన్నాళ్లుగా అడవిలోనే ఉండిపోయింది.
పెద్దరాణి ని రాజు బాగా చూసుకోవడంతో ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
చిన్నరాణి చేసేది లేక రాజ్యానికి తిరిగొచ్చింది. కానీ ఎవరూ గుర్తుపట్టలేదు సరికదా రాజుకూడా ఆమెని వెళ్లగొట్టాడు...
అందుకే మనకు దానగుణం,దయాగుణం వుంటే మంచి జరుగుతుంది.అహంకారంతో ఉంటే ఎప్పుడూ చెడే జరుగుతుంది. కథ పూర్తిచేసి చిన్నారి వైపు చూసింది నాయనమ్మ.
చిన్నారి కథ భలేవుంది నాయనమ్మ అంటూ నిద్రలోకి జారి కలల లోకంలో విహరించింది. నాయనమ్మ కూడా నిద్రలోకి జారుకుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి