సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 భీష్మ పర్వము తృతీయాశ్వాసము-272 వ రోజు
అర్జునుడు శిఖండిని ప్రోత్సహించుట
అర్జునుడు " శిఖండీ ! నీవు భీష్ముని ఎదిరించు నేను నీ పక్కనే ఉంటాను నీవేమి భపడ వద్దు. నిన్ను చూసి భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు. నేను భీష్ముని కూలుస్తాను " అని ప్రోత్సహించాడు. ఈ పలుకులు విని ధృష్టద్యుమ్నుడు " రండి మన వీరులంతా ఒక్క సారిగా భీష్ముని ఎదుర్కొనండి మనకు తోడుగా అర్జునుడు ఉన్నాడు " అని అరిచాడు. అది విని ధర్మరాజు, భీముడు, నకులసహదేవులు, అభిమన్యుడు, ద్రౌపదీ సుతులు, విరాటుడు, చేకితానుడు, సాత్యకి, ధృష్టకేతు, కేకయరాజులు, మాగదులు మొదలైన రాజులంతా తమ సైన్య సమేతంగా భీష్ముని చుట్టుముట్టారు. ఇది చూసిన అశ్వత్థామ, భూరిశ్రవనుడు, కాంభోజరాజు, కృపాచార్యుడు, కృతవర్మ, వికర్ణుడు, వివిశంతి, దుర్ముఖుడు, చిత్రసేనుడు మొదలైన యోధులు భీష్మునికి సాయంగా వచ్చారు. శిఖండిని ముందు నిలిపి యుద్ధం చేయుచున్న అర్జునునికి భీష్మునికి మధ్యలో దుశ్శాసనుడు నిలిచి కృష్ణార్జునుల మధ్య ఇరవై పదునైన బాణములు వదిలాడు. వాటిని మధ్యలో త్రుంచిన అర్జునుడు దుశ్శాసనునిపై నూరు నారాచబాణములు వేసాడు. దుశ్శాసనుడు అయిదు బాణములు అర్జునుని నుదుటన నాటాడు. అర్జునుడు దుశ్శాసనుని విల్లు త్రుంచాడు. దుశ్శాసనుడు వేరొక విల్లు తీసుకుని అర్జునునిపై ఇరవై బాణములు వేసాడు. అర్జునుడు వాటిన త్రుంచి వాడి అయిన బాణముతో దుశ్శాసనుని వక్షస్థలం పై కొట్టాడు. దుశ్శాసనుడు మూర్చిల్లాడు. దుశ్శాసనుని సారథి రథమును భీష్ముని వెనుకకు తీసుకు వెళ్ళాడు. తెలివి తెచ్చుకున్న దుశ్శాసనుడు తిరిగి భీష్ముని ముందుకు వచ్చి అర్జునినితో పోరు సాగించాడు. సాత్యకితో అలంబస భగదత్తులు, అభిమన్యునితో సుదక్షిణుడు, విరాట ద్రుపద మహారాజులతో అశ్వత్థామ, సహదేవునితో కృపాచార్యుడు, నకులునితో వికర్ణుడు, ఘటోత్కచునితో ధుర్ముఖుడు, భీమసేనునితో భూరిశ్రవసుడు, చేకితానునితో చిత్రసేనుడు, ధర్మరాజుతో ద్రోణుడు పోరు సల్పుతున్నాడు. ఇరువైపులా ఉన్న యోధులు ఒకరి కేతనములు ఒకరు విరుస్తూ, గుర్రములను, ఏనుగులను చంపుతూ, ఒకరిని ఒకరు నరుక్కుంటూ ఉన్నారు. రక్తం ఏరులై పారుతుంది. ఇంతలో మధ్యాహ్నం అయింది. దుశ్శాసనుని అస్త్రశస్త్రములన్నీ త్రుంచిన అర్జునుడు అతడి కేతనమును పడగొట్టి, విల్లు విరిచి శరీరం నిండా శరములు గుచ్చి జయధ్వానాలు చేసాడు. అర్జునుని ధాటికి తాళలేని దుశ్శాసనుడు అక్కడి నుండి వెళ్ళి పోయాడు.
మధ్యాహ్న సమయసమరం
దుశ్శాసనుడు వైతొలగిన తరువాత అర్జునుడు భీష్ముని ముందు నిలిచిన కౌరవ సేనలను చెండాడుతున్నాడు. అది చూసిన ద్రోణుడు మహా కోపంతో అర్జునుని ఎదుర్కొన్నాడు. ఇంతలో అపార సేనావాహినితో అక్కడకు వచ్చిన ధర్మరాజు ద్రోణుని ఎదుర్కొన్నాడు. ఈ పరిణామం చూసి ద్రోణుడు అశ్వత్థామను పిలిచి " కుమారా ! ఈ రోజు నా మనసెందుకో తడబడుతుంది. దివ్యాస్త్రములు స్పురణకు రావడం లేదు. చేతులు వణుకుతున్నాయి, విల్లు జారిపోతుంది, పిడికిలి పట్టు సడలుతుంది, మనస్సు వశం తప్పుతుంది ఈ రోజుతో అర్జునుడు గాంగేయుని వధించి తన శపధం నెరవేర్చుకుంటాడు అనిపిస్తుంది. అది చూడు అర్జునిని ధాటికి గుర్రములు, ఏనుగులు కూలుతున్నాయి. రధములు విరిగి పడుతున్నాయి యమధర్మరాజులా అర్జునుడు రణభూమిలో విహరిస్తున్నాడు. యుధిష్టరుని ముఖంలో కోపం ప్రజ్వరిల్లుతుంది. భీష్మునికి కీడు కలుగుతుందేమో అని అనుమానంగా ఉంది. ద్రౌపదేయులు, నకుల సహదేవుల సహితంగా పోరాడుతున్న ధర్మతనయుని విడిచి నేను రాలేను. కనుక నీవు భీష్మునికి సాయంగా వెళ్ళు " అన్నాడు. తండ్రి ఆదేశం మేరకు అశ్వత్థామ భీష్మునికి సాయంగా వెళ్ళాడు. భీమసేనుడు భీష్ముని ముందు రక్షణగా ఉన్న సైన్యాలను నిర్మూలించాడు. అది చూసిన భగదత్తుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, సైంధవుడు, చిత్రసేనుడు, దుర్మర్షణుడు, విందానువిందులు భీష్మునికి రక్షణగా నిలిచి నానాస్త్రములతో భీముని దుర్కొన్నారు. భీముడు చలించలేదు. అర్జునుడు భీమసేనునికి సాయంగా వచ్చి నిలిచి యోధులందరి కేతనములు విరిచి, విల్లులు త్రుంచి, రథములు విరుగకొడుతూ వీరవిహారం చేస్తున్నాడు. ఇది చూసి సుయోధనుడు సుశర్మను పిలిచి భీమార్జునులను ఎదుర్కొనమని చెప్పాడు. సుశర్మ పదిమంది యోధులతో భీమార్జునులను ఎదొర్కోడానికి వెళ్ళాడు. కాని ఏ ఒక్కరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయ లేక పోతున్నారు. సుయోధనుడు కలవర పడి తనసైన్యం యావత్తు అక్కడకు రమ్మని ఆదేశించాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు