హలో పిల్లలూ! మోదుగ చెట్టు ఆకులతోనూ, గోరింటాకులతోనూ అమ్మాయి బొమ్మను చేశాను. మోదుగ చెట్టు ఆకులను విస్తర్లుగా కుట్టుకుని భోజనం, టిఫిన్లు చేస్తారు. తాటి ముంజలు, నేరేడు పండ్లను ఈ ఆకులలో చుట్టి ఇస్తారు. తాటి ముంజలు కొన్నప్పుడు మోదుగ ఆకుల్లో చుట్టి ఇవ్వడం వలన నాకీ ఆకులు వచ్చాయి. కొత్త రకం ఆకులు దొరికితే బొమ్మల్లో వాడుతుంటాను. ఈ బొమ్మ చేసేటప్పుడు పిల్ల సరిగా ఒక చోట నిలబడలేదు. ఒట్టి అల్లరి పిల్ల. అందుక అందంగా తయారు చేయలేకపోయాను. రాక్షసి పిల్లగా తయారయింది. సృష్టిలో అందరూ అందమైన పిల్లలే ఉంటారా! మోదుగా చెట్టు ‘ఫాబేసి’ కుటుంబానికి చెందింది. దీని శాస్త్రీయ నామం‘‘బుటియా మోనోస్పెర్మా’’ . ఈ చెట్టు 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీనిని సంస్కృతంలో ‘‘పలాశ’’ అంటారు. 1757లో జరిగిన ‘ప్లాసీ యుద్ధం’ జరిగిన ప్రాంతాన్ని ‘‘పలాశి’’ అంటారు. పలాశి వృక్షములు పెరిగే ప్రాంతమని అర్ధం. అది మారి ‘‘ప్లాసీ’’గా రూపాంతరం చెందింది. కన్నడంలో దీనిన ‘‘బ్రహ్మా వృక్ష’’ అని అంటారు.
గోరింటాకు చేతులకు పెట్టుకుందామని చాలా కోసుకున్నాను. ముందుగా అమ్మాయిని తయారు చేశాను. తల, చేతులు, కాళ్ళు శరీరమంతా గోరింటాకుతో చేశాను. అల్లరి పిల్ల కదా అని ఎర్రటి కళ్ళు పెట్టాను. స్కర్ట్‌ను మాత్రం మోదుగా ఆకులతో కుట్టాను. బ్లౌజు కూడా గోరింటాకుతోనే కుట్టాను. జడలేద్దామంటే వేయించుకోలేదు. ఒట్టి మొండి ఘటం. ఏం చేద్దాం! అలానే వదిలేశాను. మా అల్లరి రాక్షసి పిల్లను చూడండి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి