ఊషన్నపల్లి ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో అత్యధిక విద్యా ప్రమాణాలతో పిల్లలకు విద్యా బోధన చేస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చదివించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య కోరారు. మంగళవారం ఆయన ఊషన్నపల్లి ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో సుశిక్షితులైన, విశేష బోధనానుభవం కలిగిన అధ్యాపకుల చేత ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన ఉచిత బోధనను అందిస్తున్నారన్నారు. ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆంగ్లమాధ్యమ పాఠశాలలో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక లక్షా ఏడు వేలతో స్మార్ట్ టీవి, రూ.7 లక్షలతో సోలార్ విద్యుత్తు ని ఏర్పాటు చేశామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో స్మార్ట్ టీవీతో పిల్లలకు డిజిటల్ తరగతులను నిర్వహిస్తామన్నారు. పాఠశాల పిల్లల సౌకర్యం కోసం దాతల ద్వారా రూ. 1 లక్ష విలువైన మినరల్ వాటర్ ప్లాంట్, ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో రూ. 30.25 లక్షల విలువైన అద్భుతమైన నూతన తరగతి గదులను నిర్మించామన్నారు. ఈ సారి పాఠశాలలో కంప్యూటర్ విద్యను ప్రారంభించామని, పిల్లలు స్వయంగా నేర్చుకునే విధంగా పాఠశాలలో తగిన ఏర్పాటు చేశామన్నారు. రూ.1.5 లక్షల విలువతో ప్రీ ప్రైమరీ స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేశామన్నారు. రెగ్యులర్ సిలబస్ తో పాటు ప్రాథమిక స్థాయి నుంచి పిల్లలకు నవోదయ, సైనిక్, గురుకుల, ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ చేస్తున్నామన్నారు. 2025-26 సంవత్సరంలో గురుకుల, మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలో 13 మంది బాలబాలికలు అత్యంత ప్రతిభ కనబరిచి విజయం సాధించారన్నారు. ఇద్దరమ్మాయిలు రాష్ట్రస్థాయి నీతి పద్యాల పోటీల్లో గెలుపొందారున్నారు. ప్రతి రోజు రెండు గంటలు అదనంగా పనిచేస్తూ పిల్లలను అద్భుతంగా తయారు చేస్తున్నామని ఈర్ల సమ్మయ్య తెలిపారు. ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రెండుసార్లు చాంపియన్ స్కూల్ (బెస్ట్ స్కూల్) అవార్డును జిల్లా కలెక్టర్ చేతులమీదుగా అందుకున్నామన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, వార్డు సభ్యులు ఆవుల సునీత, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, గోపిశెట్టి సుప్రియ, బండారి సరిత, పిల్లలు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, పలువురు పాల్గొన్నారు.
అత్యధిక విద్యా ప్రమాణాలతో బోధన
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి