పట్టుదల: - రిషిక, 10 వ తరగతి , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట
  

ఒక గ్రామంలో  అనిలా,రమ్య సంధ్య, స్వాతి అని నలుగురు స్నేహితురాల్లు ఉండేవారు. వాళ్లంతా ప్రాథమిక విద్యను ఒకే ప్రభుత్వ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి చదువు ఆటలు అన్నీ కలిసి సాగేవి.
 ఆరవ తరగతికి వచ్చేసరికి పరిస్థితులు మారాయి. అనిలా తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవించేవారు. వారి ఆర్థిక పరిస్థితి కారణంగా అనిలాను ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో చేర్పించడం సాధ్యం కాలేదు. అందుకే ఆమెను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని నిర్ణయించుకున్నారు.
   అదే సమయంలో రమ్య, సంధ్య, స్వాతి గొప్ప కార్పొరేట్ పాఠశాలల్లో చేరుతున్నామని చెప్పారు. ఆ మాటలు విన్నా అనిలాకు కొంత బాధ కలిగింది. ఇంటికి వెళ్లిన తరువాత తండ్రి చేసే కష్టం, తల్లి చేసే పనులు చూసిన అనిలా ఒక గట్టి నిర్ణయం తీసుకుంది -
  " నా తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటాను".
 ఒకరోజు అనిలా పాఠశాలకు వెళ్తుండగా  తనతో కలిసి చదువుకున్న పూర్వ మిత్రులు అనిలాను చూసి హేళన చేశారు. "మేమందరం కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాం, నువ్వు మాత్రం గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తున్నావా?" అన్నారు.
 ఆ మాటలు అనిలా మనసును గాయపరిచాయి. పాఠశాలకు వెళ్లాక ఆమె చాలాసేపు ఏడుస్తూ కూర్చుంది. అది గమనించిన ఒక గురువుగారు ఆమె దగ్గరకు వచ్చి అడిగారు  " ఎందుకు ఏడుస్తున్నావమ్మ? "
 
 అనిలా జరిగిందంతా చెప్పింది. అప్పుడు గురువుగారు చిరునవ్వుతో ఇలా అన్నారు -
   "అమ్మ, మనం ఎక్కడ చదివామన్నది ముఖ్యం కాదు ఎలా చదివామన్నది నిజంగా ముఖ్యం.
 
 ఆ మాటలు అనిలా చెవుల్లో మారుమోగడం  మాత్రమే కాదు, ఆమె హృదయానికి గట్టిగా హత్తుకున్నాయి. అది కేవలం ఓదార్పు మాట కాదు, అనిలా జీవితాన్ని మలుపు తిప్పిన క్షణం.
   ఆ ఒక్క వాక్యంతో ఆమెలోని బాధ ఆత్మవిశ్వాసంగా మారింది, అవమానం పట్టుదలగా మారింది. ఆ రోజు నుంచే అనిలా ఆలోచన కూడా మారిపోయింది.
    ఆ రోజు నుంచి అనిలా చదువుతోపాటు ఇంటి పనుల్లోనూ తల్లిదండ్రులకు సహాయం చేయడం మొదలు పెట్టింది. సెలవుల్లో పొలాల్లో పనిచేసినా చదువును మాత్రం ఎప్పుడు వదలలేదు.
  అలా రోజులు గడిచాయి. అనిలా కష్టపడుతూ చదువుతూ పదవ తరగతికి చేరింది. పరీక్షలు వచ్చినప్పుడు ఆమె పూర్తి నమ్మకంతో రాసింది. ఫలితాలు వెలువడిన రోజు అనిలా  గ్రామంలోనే అధిక మార్కులు సాధించింది. కార్పోరేట్ పాఠశాలలు చదివిన రమ్య, సంధ్య, స్వాతి కంటే కూడా ఆమె ఎక్కువ మార్కులు తెచ్చుకుంది.
  గ్రామ సర్పంచ్ గారి చేతుల మీదుగా అనిలాను సన్మానించారు.
 అప్పుడు అనిలా చెప్పింది -" జీవితంలో కొందరు హేళన చేస్తారు కానీ వాటిని పట్టించికోకుండా దృఢంగా నిలబడి మన పని మనం చేయాలి.
 ఎక్కడ చదివామన్నది కాదు ఎలా చదివామన్నది ముఖ్యం.
 ఆ మాటలు విన్నా రమ్య, సంధ్య, స్వాతి, అనిలా దగ్గరకు వచ్చి అన్నారు - నువ్వు మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి దానికి తగినట్టి ఫలితం ఇచ్చావు.' మేము చేసింది తప్పే, ఇప్పటికైనా మాకు అర్థమయింది-
  ఎక్కడ చదివామన్నది కాదు ఎలా చదివామన్నదే ముఖ్యం, నీదే నిజమైన విజయం.

 మన పరిస్థితులు కాదు మన ప్రయత్నమే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది.....
=========================================================
ఉషా-కీ.శే.శ్రీ రాంభట్ల బాలకృష్ణ శర్మ  స్మారకార్థం పిల్లలు రాసే పిల్లల కథల పోటీల్లో బహుమతి పొందిన కథ 
కామెంట్‌లు