శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 143


 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
121. భయాపహా (చతురాక్షరీ)
122. శాంభవీ (చతురాక్షరీ)
నూట ఇరవైఒకటవ నామ మంత్రము:
ఓం శాంభవ్యై నమః
"అష్టవర్షాత్ భవేత్ కన్యా" అని కదా, దేవీభాగవత వాక్యం. అంటే ఎనిమిది సంవత్సరాల వయస్సు కలిగిని బాలిక - ఈమెను"శాంభవి" అని కూడా అంటారు.
శంభుడు - శంకరుడు. శంభుని సతీమణి "శాంభవి". దేవీ నవరాత్రులలో, ఆశ్వయుజ మాసం లో ఏడవ రోజున, ఎనిమిది సంవత్సరాల బాలకు పూజ చేస్తారు. ఈ పూజను, కుమారీ పూజ అని, శాంభవీ పూజ అని, బాల పూజ అని పిలుస్తారు. శ్రీమాత, తానే శాంభవి గా వచ్చి, మన చేత పూజలందుకోడానికి మన మధ్యకు వచ్చి, దర్శనం ఇస్తున్న జగన్మాతను చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "శాంభవీ" అని కీర్తించారు. బాల కు నమస్కారము.
"శాంభవీ" అంటే యోగం. ఈ కుమారి కన్నులు లోకములో జరుగుతున్న అన్ని విషయాలనూ చూస్తున్నట్లే, కన్నులు తెరుచుకునే ఉంటుంది. కానీ, కనురెప్పలు మూయబడవు. తెరుచుకోవు. ఈ కుమారి, త్రికాలలాలోనూ యోగ సాధనలో ఉంటుంది. ఆమే దృష్టి ఎప్పుడూ కూడా అంతర్ముఖం గా ఉంటుంది. తిరోధాన ప్రక్రియలో భాగంగా సహస్రారం లో, త్రికోణం మధ్యలో, బిందువు రూపంలో ఉన్న శంభుని చేరుకునే ప్రయత్నం చేసి, చేరుకుంటుంది.
శంభుడు, అవ్యక్తుడు. ఏ భావమూ వ్యక్తము కాదు. ఆయన వద్ద లభించే శాంతి, సౌఖ్యములను గ్రహించిన శాంభవి, ఆ శాంతి, సౌఖ్యాలను యోగ సాధనలో ఉండి, తనను యొగినిగా గుర్తించి, సాధన చేసే సాధకులకు అనుగ్రహిస్తుంది.
జగత్తుకు తండ్రి అయిన శంభుడు, వ్యక్తముకాని అన్ని భావాలకు ప్రతిరూపం అయితే, వ్యక్తమయి కనిపించే ప్రతీ భావానికి, శాంతి, సౌఖ్యం, సౌభాగ్యాలకు ప్రతిరూపం అమ్మ శాంభవీ. తనను బాలగా, కుమారీగా సద్గురువు అనుగ్రహంతో తెలుసుకుని, తననే లక్ష్యం చెసుకున్న తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం శాంభవ్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు