కోయంబత్తూరుకు చెందిన ఈ న్యాయమూర్తి నిరాడంబరతకు నిలువెత్తు రూపం!
అధికారం, హోదా ఉండటం తలబిరుసుతనం లేకుండా, సాదాసీదాగా జీవించేవాళ్ళను ఈ ప్రపంచం ఎప్పుడూ ఆశ్చర్యంగానే చూస్తుంది. సరిగ్గా అలాంటి ఒకరి గురించే ఇప్పుడు పలువురు చర్చించుకుంటున్నారు!
ఆయనే కోయంబత్తూరు జిల్లా 5వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పి.కె. శివకుమార్ గారు. నామక్కల్ జిల్లాకు చెందిన ఈయన వయసు 53 ఏళ్ళు. ఇంతకీ అందరూ ఈయన్ని ఎందుకు అంతలా ప్రశంసిస్తున్నారో తెలుసా...
హంగూ ఆర్భాటాలు అసలే లేవు : అంత పెద్ద పదవిలో ఉండికూడా, ఎలాంటి ఖరీదైన కారును ఉపయోగించకుండా ప్రతిరోజూ కోర్టుకు సైకిలుపైనే వెళ్తారు.
కలిసికట్టుగా భోజనం : ఇంటి నుంచి మధ్యాహ్నం భోజనం తెచ్చుకునే ఆయన, విడిగా కూర్చుని తినకుండా.. ఎలాంటి తారతమ్యాలు చూపించకుండా కోర్టు సిబ్బందితో కలిసి కూర్చుంటారు.
పరివారం వద్దు : కోర్టు ప్రాంగణంలో ఎప్పుడూ ఒంటరిగా నడిచివెళ్లే అలవాటున్న ఈయన, తన వెంట కోర్టు దుస్తులు ధరించిన సేవకులు ఎవరూ రావడం అస్సలు ఇష్టపడరు!
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు ప్రజలతో ఎంత నిరాడంబరంగా మెలగాలో చెప్పడానికి ఆయనే ఒక అద్భుతమైన ఉదాహరణ.
శివకుమార్ కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టేటప్పుడు, ఆయన రాకను భద్రతా సిబ్బందో లేదా ప్రభుత్వ వాహనాలో చాటవు... బదులుగా ఆయన సైకిల్ గంట శబ్దాలే ఆయన రాకను సూచిస్తాయి. సుంగం సమీపంలోని శివరామ్ నగర్‌లోని తన ఇంటి నుండి, నిత్యం రద్దీగా ఉండే తిరుచ్చి రోడ్డు మీదుగా కోర్టు ప్రాంగణం వరకు ప్రతిరోజూ సైకిల్‌పై ప్రయాణిస్తూ, ఈ న్యాయమూర్తి కోర్టుకు రావడానికి ఎంతో సాదాసీదా మార్గాన్ని ఎంచుకోవడం గమనార్హం.
ఒకరు ఇంటర్వ్యూ కోసం సంప్రదించినప్పుడు మాట్లాడటానికి నిరాకరించిన ఈ న్యాయమూర్తి, ఇటీవలే వార్తల్లో నిలిచారు.
ఆయన కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ న్యాయమూర్తి తన అధికారిక వాహనాన్ని అత్యవసరమైతే తప్ప వాడరు. ఇతర జిల్లాలకు అధికారిక పర్యటనలకు వెళ్లాల్సి వస్తే బస్సు లేదా రైలులోనే ప్రయాణించడానికి మొగ్గు చూపుతారు.
"సాధారణ సంప్రదాయానికి భిన్నంగా, న్యాయమూర్తి తన గదిలోకి వెళ్లేటప్పుడు కూడా మమ్మల్ని పాదరక్షలు విప్పమని చెబుతారు. విచారణకు హాజరయ్యే నిందితుల పట్ల కూడా ఆయన ఇదే విధమైన మర్యాదను ప్రదర్శిస్తారు. వారికి కూర్చోవడానికి సీటు ఇవ్వడం ఎన్నడూ మరువరు" అని ఆ వర్గాలు తెలిపాయి.
ఆ న్యాయమూర్తి వద్ద బెంచ్ క్లర్కుగా పనిచేస్తున్న డి. మురుగవేల్ మాట్లాడుతూ, "ఆయనకు ప్రత్యేక విశ్రాంతిగది ఉన్నప్పటికీ న్యాయ మూర్తి ఎప్పుడూ కామన్ హాల్‌లోనే మాతో కలిసి లంచ్ చేస్తారు. తన లంచ్‌ను మాతో పంచుకుంటారు, ఇది కోర్టుకు వచ్చే న్యాయవాదులను తరచుగా ఆశ్చర్యపరుస్తుంది..." అని అన్నారు.
కోయంబత్తూరు కోర్టుల్లో దశాబ్ద కాలానికి పైగా ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది పి. అన్బుసెల్వన్ మాట్లాడుతూ, న్యాయమూర్తి సమీపంలోని కాఫీ దుకాణానికి కూడా సైకిల్‌పైనే వెళ్తారని, రోడ్డు పక్కన ఉన్న వ్యాపారుల పండ్లు కొనడానికి ఇష్టపడతారని చెప్పారు. "న్యాయ మూర్తి వంటి ఉన్నత పదవిలో ఉన్న ఆయనలో ఎలాంటి అహంకారం కనిపించదు" అని ఆయన అన్నారు.
కోయంబత్తూరులో ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తిగా సేవలందిస్తున్న ఆయన అంతకుముందు కోయం బత్తూరు జిల్లా న్యాయవ్యవస్థలో సబ్ జడ్జిగా, ఆ తర్వాత చీఫ్ జుడీషియల్ మేజిస్ట్‌రేట్‌గా పని చేశారు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి