మా నాన్నగారు వ్యాసాంజలిలో తిరుమలరావు వ్యాసం
 


పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల సాంఘిక శాస్త్రోపాధ్యాయులు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత  కుదమ తిరుమలరావు పంపిన వ్యాసం మా నాన్నగారు వ్యాసాంజలి సంకలనానికి ఎంపికై, ప్రచురితమైంది.
తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, రంగసాయిపేట వాస్తవ్యులు, పర్వతగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేస్తున్న డా.మడత భాస్కర్ ఆధ్వర్యంలో ఈ మా నాన్నగారు వ్యాసాంజలి రూపుదిద్దుకుంది. నేడు అంతర్జాలం ద్వారా జూమ్ వేదికగా జరిగిన సమావేశంలో సిబిఐ విశ్రాంత జె.డి. వి.వి. లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ప్రతి తండ్రి చేసే త్యాగాల ఫలితమే వారి పిల్లల ఉజ్వలమైన జీవితమని అంటూ పెక్కు ఉదాహరణలిచ్చారు. ఈనాటి జూమ్ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాస్ట్రో గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నాన్నగారు వ్యాసాంజలి సంకలనం తన గజల్ గానానికి భవిష్యత్తులో సూచిక గ్రంథం కాగలదని అన్నారు. ఓ.యు.కి చెందిన ప్రముఖులు, నవల రచయిత సాహిత్యవేత్త నర్రా ప్రవీణ్ రెడ్డి పుస్తక సమీక్ష గావిస్తూ మడత భాస్కర్ ఇదివరకే 2023లో నాకు నచ్చిన గురువు , 2025లో అమ్మకు ప్రేమతో అనే పవిత్రమైన గ్రంథాలు రూపొందించగా నేడు మా నాన్నగారు వ్యాసాంజలి సంకలనానికి మరోసారి సాహసించి సఫలీకృతమైనారని అభినందించారు. తండ్రి గూర్చి చెబుతూనే వారి సేవలందు గల రైతాంగ పోరాటాలు, కళా సాంస్కృతిక రాజకీయ సామాజిక నేపథ్యాలను కూడా తమకు తెలియకుండానే స్పృశిస్తూ అమోఘంగా రచనలు చేసారని గ్రంథ రచయితలను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుమాట వ్రాసిన ప్రముఖులు, అతిథులు ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య పంతంగి వెంకటేశ్వరులు, మడత ఆర్యన్ తదితరులు నాన్న అనే ఇతివృత్తం గూర్చి ఉపన్యసించారు. 
ఈ సందర్భంగా వ్యాసకర్త కుదమ తిరుమలరావు మాట్లాడుతూ 72మంది రచనల, నాకు నచ్చిన గురువు సంకలనం 350 పేజీలతో రూపొందించిన డా.మడత భాస్కరరావు అపూర్వమైన గురుభక్తిని చాటి చెప్పారని అన్నారు. అలాగే 96మంది రచనల, అమ్మకు ప్రేమతో సంకలనం 416పేజీలతో ఆయనే రూపొందించి, అచంచలమైన మాతృ ప్రేమను లోకానికి స్పష్టపరిచారని అన్నారు. ఇప్పుడు భాస్కర్ ఆధ్వర్యంలో 189 మంది రచనల మా నాన్నగారు వ్యాసాంజలి, 959 పేజీలతో ఆవిష్కృతమైందని, అందులో తన వ్యాసాంజలికి స్థానం లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని తిరుమలరావు అన్నారు. తిరుమలరావు సొంతూరు 
పార్వతీపురం మన్యం జిల్లా, జియ్యమ్మవలస మండలం, కుదమ గ్రామం. తిరుమలరావు తండ్రి కుదమ నరసింగరావు బాబయ్య పట్నాయక్ ఆ గ్రామంలో 1918 లో జన్మించి, 1997 లో పరమపదించగా, అతని జీవితంలో అరుదైన ఘట్టాలను తిరుమలరావు వ్యాసరూపంలో విగ్రహారాధన శీర్షికతో పంపగా ఎంపికైంది. తిరుమలరావు, తన తండ్రి మిలటరీలో 1945నుండి 1947వరకూ నైజాం మహారాష్ట్ర నందు జాల్నా లో హవల్దార్ క్లర్క్ గా బాధ్యతలను చేపట్టి స్వాతంత్ర్య సముపార్జన సేవలో తరించిన విషయాన్ని ఈ వ్యాసాంజలిలో పేర్కొన్నారు. తన తాతకు 9మంది, చినతాతకు 9మంది సంతానం కాగా వీరందరికీ మా నాన్నే పెద్దన్నయ్య కావడంతో కుటుంబ బాధ్యతలకు కట్టుబడి మిలటరీని వదలి వచ్చేసారని తిరుమలరావు వివరించారు. నాన్నమ్మ కుదమ నారాయణమ్మ, తాతయ్య కుదమ గంగన్న పట్నాయక్ బాబయ్యల పిలుపు మేరకు మిలటరీ సేవలను అయిష్టంగానే వదలి వచ్చేసిన అనంతరం టీచర్, డీలర్, కురుపాం ఎస్టేట్ రాజు నిర్దేశిత సర్వేయర్, డైమండ్ కలెక్షన్ బేలెన్స్ డి.సి.బి. క్లర్క్, కోపరేటివ్ సోసైటీ సెక్రటరీ, విలేజ్ కరణం, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, తోటపల్లి తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థాపక కమిటీ అనుబంధ సలహా సంఘ సభ్యులు, నాగూరు ఫిర్కా గ్రామోద్యోగుల సంఘ అధ్యక్షులు, పిప్పలభద్ర పంచాయతీ ఇన్ ఛార్జ్ వి.కె. వంటి అనేక ఉద్యోగాలు, బాధ్యతలు నిర్వహించిన తన తండ్రిని సవ్యసాచి అంటూ తిరుమలరావు పూర్తి వివరాలతో విశదీకరించి పంపారు. అంతేగాక మహాత్మాగాంధీ, ఘంటసాలలు ఉండే సభల ముంగిట కళ్ళారా చూసిన తన తండ్రి రామాయణం మహాభారతం భాగవతం వంటి ఇతిహాసాలను అలవోకగా చెప్పగల్గిన కథనాలను కూడా ఈ వ్యాసంలో వివరించారు. తెలుగు ఇంగ్లీషు వ్యాకరణ అంశాలు బాగా చెప్పగల్గేవారని, పౌరాణిక నాటక ప్రదర్శనలను చూసేందుకు ఆసక్తి కనబరిచేవారని, ఎన్టీఆర్ ఎఎన్నార్ సినిమాలు చూసి విశ్లేషణ జరిపేవారంటూ తండ్రి అభిరుచులతో పాటు, గ్రామానికి చేసిన సేవలు త్యాగాలను కూడా తిరుమలరావు తెల్పగా ఈ నాన్నగారు వ్యాసాంజలి సంకలనంలో చోటు దక్కించుకున్నాయి. ఈ వ్యాసరచనలో ఆనాటి పార్వతీపురం తహశీల్దార్ శంకరాభరణం జె.వి.సోమయాజులు కుదమ గ్రామ పర్యటనకు వచ్చి, తన తండ్రిని ఉద్దేశించి ధనాపేక్ష లేని వ్యక్తి, పేద ప్రజల పట్ల మానవత్వం గల శక్తి, ఉత్తమ విలేజ్ కరణం అంటూ అభినందించిన విషయాన్ని విపులీకరించారు. తిరుమలరావు ఈ వ్యాసం రచించేటప్పుడు, విషయ సేకరణలో తన అన్నయ్య, విశ్రాంత మండల విద్యాశాఖాధికారి, రాష్ట్ర స్థాయి ఉత్తమ సైన్స్ టీచర్ పురస్కార గ్రహీత కుదమ పరమేశ్వరరావు ఎంతగానో తోడ్పడ్డారని, జట్టు ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డొల్లు పారినాయుడు, గాయకులు నటులు దర్శకులు కళాకారులు రౌతు వాసుదేవరావు తదితరులు కూడా సమాచార సేకరణలో సహకరించారని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తన కుటుంబ సభ్యులు అమ్మ అరంజ్యోతి, అన్నయ్యలైన ముకుందరావు జగన్నాధరావు పట్నాయక్, అక్క కరుణకుమారి వారసులు, అన్నయ్య పరమేశ్వరరావు,
అక్కలు ఇందిరా, అలివేలు, తమ్ముడు సత్యసాయిబాబాల ప్రోత్సాహంతో త్వరలోనే తన తండ్రి విగ్రహ ప్రతిష్ట జరుగనున్నదని అందుకే ఈ వ్యాసానికి శీర్షిక విగ్రహారాధన అని నిర్ణయించానని తిరుమలరావు అన్నారు.
కామెంట్‌లు