వణ్దదాసనా? కళ్యాణ్జీయా?: - - యామిజాల జగదీశ్

 

 — మౌనం లోని రెండు కోణాలు
ఒకే హృదయానికి ఉన్న రెండు వ్యక్తీకరణలు ఆయన. ఒకరు కథల ద్వారా మనుషులను మనస్సులో చేరుకుంటే... మరొకరు కవితల ద్వారా మపాఠకుడి ప్రశాంత తరంగాలను స్పృశిస్తారు.
వణ్ణదాసన్ — మౌనానికి కథకుడు
"చేతులతో పట్టుకోవడం తెలిసిన ప్రతి అరచేతికి ఈ జగత్తంతా పూల వనంలాంటిదే..."
వణ్ణదాసన్ కథల్లో జీవితం  ఆర్భాటంగా హడావుడిగా రాదు. అది నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి మన పక్కన కూర్చుంటుంది. వీధిపోరాటాల మనుషులు, పరిచయమున్న ముఖాలు, వ్యక్తపరచలేని ప్రేమ, దాచుకున్న కన్నీళ్లు — ఇవన్నీ ఆయన రచనల్లో ప్రాణం పోసుకుంటాయి.
ఆయన కథలు కేవలం ఒక సంఘటనను చెప్పవు; ఒక మనిషి లోపలి అంతరాత్మను తెరిచి చూపుతాయి.
ఆయన దగ్గర పెద్ద పెద్ద మాటల ఆర్భాటాలు ఉండవు. కానీ ఒక చిన్న వాక్యంలోనే ఒక పూర్తి జీవితపు నీడను చూపించే శక్తి ఆయనకుంది.
"స్నానం చేయడానికి ముందున్న నది,  స్నానం చేసిన తర్వాత ఉన్న నది వేరు కాదు. అలాగే మీరు చూసే నది, నేను చూసే నది కూడా ఒక్కటి కాదు. ఏదీ ఒకేలా ఉండదు, అలాగని ఏది వేరుగానూ ఉండదు..."
దీని అర్థం మీరు పెద్ద 'జెన్' (Zen) తత్వవేత్త కానవసరం లేదు; వణ్ణదాసన్ పాఠకుడైతే చాలు.
కళ్యాణ్‌జీ — ప్రశాంతతకు కవితనిచ్చినవారు
"నీటి తొట్టిలో
చనిపోయిన కాకిపిల్లలను చూసి
మనసారా బాధపడ్డాను.
కానీ, గుమ్మం ముందు నిలబడిన
వృద్ధుడికి మాత్రం...
"ఏమీ లేవు" అని చెప్పి
పంపి వేయవచ్చు.
ఈ రోజుకు...
నేను చేయగలిగింది ఇంతే.
కళ్యాణ్‌జీ కవితలు చదవడానికి అనుభూతి చెందాల్సినవి. అవి బిగ్గరగా మాట్లాడవు; పాఠకుడి మనస్సులోకి నెమ్మదిగా పయనిస్తాయి.
"ఎన్నో నక్షత్రాలను
చూడటానికి
ఎంతో చీకటిని కూడా
చూడాల్సి వస్తుంది"
ఒక కవి నుంచి ఇంతకంటే ఎక్కువగా మనం ఏం ఆశించగలం?
చిన్న పదాలలో ఆలోచనలను మోసే ఆయన కవితలు... ప్రకృతిని, జ్ఞాపకాలను, మానవ సంబంధాలను కొత్త కోణంలో చూపుతాయి.
ఒకే ప్రయాణం — 
రెండు మార్గాలు
వణ్ణదాసన్ కథల్లో మనం మనుషులను చూస్తాం. 
కళ్యాణ్‌జీ కవితల్లో ఆ మనుషుల లోపలి భావాలను అనుభూతి చెందుతాం.
ఒకరు జీవితపు ముఖం గీస్తే, మరొకరు ఆ ముఖం వెనుక ఉన్న అనుభూతులను గీస్తారు.
అందుకే "వణ్ణదాసనా? కళ్యాణ్‌జీయా?" అనే ప్రశ్నకు ఏం చెప్పగలం...ఆయన మాటల కోట. మాటల సున్నితత్వం. మాటల ధాటి.
ఒక కన్ను ప్రపంచాన్ని చూపిస్తే... మరొక కన్ను ఆ ప్రపంచపు అర్థాన్ని తెలియజేస్తుంది.
ఒకరు కథల్లో మౌనాన్ని మాట్లాడిస్తే... మరొకరు కవితల్లో మౌనాన్నే భాషగా మారుస్తారు.
తిరునెల్వేలి మట్టివాసనతో రూపుదిద్దుకున్న ఈ రెండు సాహిత్య గొంతుకలు, తమిళంలో ఉన్న మృదువైన మానవతా సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి.
పేర్లు రెండైనా, వారి సాహిత్య ప్రయాణం ఒకే గమ్యం వైపు సాగుతోంది — అది మనిషిని మరింత దగ్గరగా అర్థం చేసుకోవడం.
వణ్ణదాసన్, కళ్యాణ్‌జీ ఇద్దరూ తమిళ సాహిత్యానికి రెండు కళ్లు.
ఇంతకీ ఇక్కడో విషయం చెప్పాలి...
వణ్ణదాసన్ గానూ, కళ్యాణ్‌జీగానూ ప్రసిద్ధి చెందిన ఈయన 1946లో తిరునెల్వేలిలో జన్మించారు. ఆయన అసలు పేరు శివ కళ్యాణ సుందరం. ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నారు. ఆయన ప్రఖ్యాత తమిళ రచయిత అయిన తి. కా. శివశంకరన్ కుమారుడు. ఆయన వణ్ణదాసన్ అనే కలం పేరుతో చిన్న కథలు, నాన్ ఫిక్షన్ వ్యాసాలు, కళ్యాణ్‌జీ అనే కలం పేరుతో కవితలు రాస్తుంటారు. ఆయన చిన్న కథల సంకలనం 'ఒరు సిరు ఇసై'కి 2016లో తమిళ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన విష్ణుపురం సాహిత్య పురస్కార గ్రహీత కూడా. దీనిని కూడా ఆయన 2016లోనే గెలుచుకున్నారు. ఆయన పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగి.
కామెంట్‌లు