వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
141. శాంతా (ద్వ్యక్క్షరీ)
142. నిష్కామా (త్ర్యక్క్షరీ)
నూట నలభైరాండవ నామ మంత్రము:
ఓం నిష్కామాయై నమః
నిష్కామా = కామ్యములు / కోరికలు లేనిది.
ఏ విధమైన కోరికలు లేనిది, జీవుల అన్ని కామ్యములను తీర్చలిగేదిగా దర్శనం ఇచ్చిన శ్రీచక్రరాజసింహాసనేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు, జగన్మాతను "నిష్కామా" అని కీర్తించారు. జీవుల యొక్క ఏ కామ్యములు, ఎప్పుడు తీర్చితే, ఆ జీవులకు శుభం కలుగుతుందో, అప్పుడు ఆ కోరికలను అనుగ్రహించే లోకమాతకు నమస్కారము.
పరమేశ్వరికి ఆత్మ లేదు. అంగములు లేవు. ఏ లేపనములు అంటవు. నిరాకార నిర్గుణ అయిన శ్రీమాతకు, తన సాధకులకు మేలు చేసి, వారి శోభను పెంచే అన్ని శుభములనూ ఇచ్చే అమ్మలగన్నయమ్మ కు కోరికలు ఎలా ఉంటాయి? ఎందుకు ఉంటాయి? ఆమెయే మూర్తీభవించిన "వరదాయిని" కదా!! అందుకనే అమ్మ "నిష్కామా" అయ్యింది.
ఈ జగత్తులో, అమ్మ, మాతృమూర్తి అయిన ప్రతీ స్త్రీ, ప్రతీ క్షణం తన సంతానం యొక్క బాగోగులు కోరుకుంటూ, అన్ని శుభాలు తన సంతానానికి లభించి, వారు సుఖ, సంతోష, సౌభాగ్యాలతో జీవితం గడపాలని కోరుకుంటుంది. కానీ, తనకు ప్రత్యేకంగా ఏదో లభించాలని, లాభించాలనీ అనుకోదు. ఆశపడదు. నిస్వార్థంగా, నిర్మలమైన మనస్సుతో తన పిల్లలకు సెవచేయడమే, ఆ తల్లి, తన యొక్క కర్తవ్యంగా భావిస్తుంది. మరి పరాత్పరుని ఇల్లాలు, చంద్రుని సహోదరీ, అయిన అంబకు ఏమి కోరికలు ఉంటాయి. తన సాధకుల, భక్తుల మనోభీష్టాలను తీర్చడం తప్ప. అందుకనే, ఆ కరుణాంతరంగ "నిష్కామా" అనబడింది.
"ఆవాప్తాఖిలకామాయాః తృష్ణా కిం విషయా భవేత్" అని సౌభాగ్య భాస్కరం లోని వాక్యం. జగన్మాత పరమేశ్వరి కి ఉన్న ఓకే ఒక్క కోరిక పరమేశ్వరుని చేయడం. అర్థనారీశ్వర తత్వాన్ని ఆవిష్కరించి, తాను, పరాత్పరుడు వేరు కాదనీ, వేరు కాలేరనీ ఈ జగత్తుకు చెప్పడం. తరువాత అంతా, అందరికీ, అన్నీ ఇవ్వడమే. ఈ సృష్టిలో, ప్రతీ ఒక్క జీవీ, తన సంతానమే కదా. జీవి పుట్టడమే కోరికల పుట్ట (పొట్ట) లోనుండి జరుగుతుంది. ఒక కోరిక తరువాత ఇంకొక కోరిక. తరువాత ఇంకొకటి. ఇలా కోరికల, తామరతంపరలో కొట్టుకు పొతూనే ఉంటాడు. అమ్మను తెలుసుకోలేక పోతాడు. ఎప్పుడైతే జీవి, ఈ కోరికల సముద్రం నుండి ఒడ్డుకు వచ్చి, స్థిరంగా కామేశ్వరిని తెలుసుకుని ప్రార్థన చేస్తాడో, ఆనాడే అమ్మకు, ప్రేమపాత్రుడు అవుతాడు. సహస్రారంలో, త్రికోణం మధ్యలో, బిందువు రూపంలో ఉన్న సాంబసదాశివుని చేరిన శ్రీమాత "నిష్కామా" అయ్యింది.
ఈ చరాచర జగత్తులో ఉన్న ప్రతీ ఒక్కరి కోరికలను నెరవేర్చగలిగేది, కాత్యాయనీ అయిన తానే అని తెలుసుకుని, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం నిష్కామాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి