వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
142. నిష్కామా (త్ర్యక్క్షరీ)
143. నిరుపప్లవా (పన్చాక్క్షరీ)
నూట నలభైమూడవ నామ మంత్రము:
ఓం నిరుపప్లవాయై నమః
నిరుపప్లవా = నాశనము లేనిది / కానిది; ప్లవము = స్రవిస్తున్న / ప్రసరిస్తున్న అమృతము
తానే జీవాత్మ అని, విశ్వాత్మ అని నిరూపిస్తూ దర్శనం ఇచ్చిన శ్రీమాతను చూసిన వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను "నిరుపప్లవా" అని కీర్తించారు. జీవుని జీవాత్మలో లీనం చేయెగల అమ్మకు నమస్కారము.
బిందు రూపంలో ఉన్న స్వామివారిని కూడిన పరమేశ్వరి, అర్థనారీశ్వరియై స్వామి యొక్క అమృతత్వ సాగరంలో తనను తాను కలుపుకుంటూ, ఆ స్వామిలో లీనమైన పరమేశ్వరి "నిరుపప్లవా" అయ్యింది.
శ్రీమాతను నిర్గుణ, నిరాకార, పరబ్రహ్మ స్వరూపిణి అని ఇంతకుముందు చెప్పుకున్నాము కదా. ఈ చరాచర జగత్తులో పాంచభౌతిక లక్షణాలతో ఏర్పడిన పదార్థమునకు గానీ, జీవులకు గానీ నాశనము తప్పదు. పుట్టాలి, ఎదగాలి, ఒరగాలి.... ఇది ఈ చరాచర జగత్తు విధానము. ఇక్కడ కనిపిస్తున్నవి అన్నీ కూడా నశ్వరములే. నాశనము అయ్యేవే. కానీ, పరమేశ్వరియే జీవాత్మ, పరబ్రహ్మ అయినప్పుడు, ఆ పరబ్రహ్మ తత్వం నుండి ఏదైనా / ఏవైనా పుడుతాయి, జన్మ పొందుతాయి తప్ప, నిరాకార, నిర్గుణ, నిర్లేప అయిన శ్రీమాతకు నాశనము అయ్యే గుణము లేదు. శరీర భాగాలు లోవు. కనుక నాశనము లేనిది. అందువల్లనే, కాత్యాయని "నిరుపప్లవా" అనబడింది.
ఆత్మ / పరబ్రహ్మ తత్వం శరీరంలో ఉంటుంది. శరీరానికి బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్య దశలు ఉంటాయి. కానీ, ఆత్మకు కాదు. మానవుడు పాత చొక్కాను విడిచి కొత్త చొక్కా వేసుకున్నట్టు, ఆత్మ ప్రస్తుత శరీర రూపాన్ని వదలి, వేరొక రూపాన్ని పొందుతుంది. కానీ, ఆత్మ నాశనము అవ్వదు. పాంచభౌతిక శరీరానికే నాశనము. పరబ్రహ్మయే శ్రీమాత. అందుకనే శ్రీచక్రరాజసింహాసనేశ్వరి "నిరుపప్లవా" అయ్యింది.
శ్రీమాత ధ్యానం వలన, మహత్తరమైన శ్రీవిద్యోపాసన చేత మాత్రమే ఆత్మజ్ఞానం లభిస్తుంది అని తెలుసుకుని, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం నిరుపప్లవాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి