మాతృ భాషకన్న మధురం ఉన్నదా?: - శిరందాస్ శ్రీనివాస్ -హైదరాబాద్ -9441673339


దేశ భాషలందు తెలుగు లెస్సయన్న
కృష్ణ దేవరాయల ప్రశంసలు మరిచావా..

నా తెలుగు తియ్యందనం
నా తెలుగు నానుడుల కమ్మదనం
నా తెలుగు జాతీయాల వైభవం
నా అమ్మ పలుకుల మధుర స్వరం
ఏ భాషలో వెతికేను 
ఏ అన్య భాషలో దొరికేను?

నా తెలుగు వెలుగులు
నన్నయ తిక్కన ఎర్రాప్రగడ 
బమ్మెర పాల్కురికి 
విశ్వ నాధుల విశ్వ ప్రభ మరిచావా..
గుర్రం జాషువా దాశరథి
శ్రీ శ్రీ సినారె ల ఘనకీర్తి గనలేవా..

అమ్మ పలుకు కమ్మదనం
అయ్య పలుకు కరకుదనం
అక్క పలుకు చిక్కదనం
అన్న పలుకు వెచ్చదనం
అన్య భాషలో దొరికేనా...


అది అమ్మ పలుకు భాష 
అది కన్న తల్లి మమకారం
కన్న తండ్రి అనురాగం 
ఇరుగు పొరుగు గుణ కారం
పండిత పామరుల చమత్కారం
కల కలిపిన ప్రేమామృతం..
పరుల భాష అరువు భాష
అతికి పెట్టు అర్థ భాష..

ఎంతటి సంక్లిష్ట భావమైనా
ఎంతటి నిగూఢ రహస్యమైనా
జటిలమైనా.. కఠినమైనా..
కమ్మటి అనురాగమైనా..
చిక్కటి ఆప్యాయత అయినా 
మాటలకందని మౌనమైనా..
హృదయాన్ని హత్తుకునేలా
అర్థమవ్వు భాష అమ్మ భాష..

హృదయాంతరాల నుండి ఉబికి వచ్చు ప్రేమ పాశమైనా
ఆపదలో పొంగివచ్చు ఉపద్రవమైనా..
ఆశ్చర్యంలో.. 
ఆనందంలో
వ్యక్తమయ్యేది...
అమ్మ భాషే కదా..

అమ్మ భాషలో వ్యక్త పరచు భావం
అన్య భాషలో బంధీ అవుతుంది..
సృజనాత్మకత కోల్పోతుంది
భాష్యం కోల్పోయి
భావం చెడిపోతుంది.

అమ్మ భాష వస్తే అన్య భాషలన్ని సులువు
నీ భాషపై నీకు పట్టు లేకుంటే 
అన్య భాషలపై పట్టేలా వచ్చు
పట్టుదలే ఉంటే పది భాషలైన నేర్వ వచ్చన్న మన పివీ  ఠీవీ మరిచావా..
వెంకయ్య వాక్చాతుర్యం వినలేదా..

ఆంగ్ల భాషలో చదివినంతనే
అందలమెక్కవచ్చునన్నది అపోహే..
తెలుగు చదివిన వారంటే తేలిపోదురన్నది ఉత్తి మాటే..
తెలుగు జాతి ఖ్యాతి నీ ఖండాంతరాల చాటిన వారు కోకొల్లలు..

పర భాషపై మోజుతో
మాతృ భాషపై మమకారం విడవద్దు..
అన్య భాషలపై క్రేజుతో
నీ నుడికారం మరవద్దు
మన పద్యం, మన గద్యం
మన ఛందస్సు మన ప్రాస
మన కవుల విజ్ఞాన భాండాగారం..
మన అచ్చుల సౌభాగ్యం
మన హల్లుల కోలాహలం
ఇలలో లేదెక్కడ..
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్న
నికోలావో మనుచ్చి మాటలు మరచిపోకు..
ఆంగ్ల భాషా పండితుడు
సి. పి. బ్రౌన్ తెలుగు గొప్పతనం గురించి చేసిన వ్యాఖ్యలు 
తెలుసుకో..

అమ్మ పలుకు భాష పలుక నీకు సిగ్గేలా..
తెలుగు బిడ్డవురోరి
తెలుగు మాట్లాడుటకు సంకోచించదవేల..
అన్య భాషలు నేర్చి
ఆంధ్రంబు రాదంటూ సకిలించు 
ఆంధ్రుడా చావవేటికిరా అంటాడు కాళోజీ..

అంత మాటలేల పడేరు
ఆడుతూ పాడుతూ
ఆనందంగా ఆంధ్రంబు
నేర్చుకో..
మాతృభాష కన్న 
మధురం ఉన్నదా..
అమ్మ పలుకు ఆంధ్రంబు
అఖిల జగత్తులో అబ్బురమందువు...


కామెంట్‌లు