బాల్యంలో తాతయ్యతో కలసి
ఊరి చివరన ఉన్న మడుగు కి వెళ్ళి
మడిగా నీళ్ళు తెచ్చుకునేందుకు
అన్నయ్య తో కలిసి వెళ్ళడం
చుట్టూ ఉన్న పచ్చని చేలు
పక్షుల కిలకిలారావాలు
చెరువులోని రంగు రంగుల చేపలను బాబుగాడితో కలసి పట్టుకోవడం
వేసవి కాలంలో ఇంట్లో తెలియకుండా
సుబ్బిగాడితో కలిసి
మడుగు లో ఈతకొట్టడం
చేపలను పట్టుకునేందుకు కొంగలు చేసే ఒంటి కాలి జపం
కలువ పూల కొరకు బావగాడితో చేసే
చెరువులోని ఈత పందాలు
అట్లతదియ నాడు అమ్మలక్కతోబాటు చెరువులో చంద్రుని దర్శనం
కార్తీక పౌర్ణమి నాడు అమ్మమ్మ తో బాటు
అరటి దొప్పలలో దీపాలు వెలిగించడం
గ్రామ ప్రజల దాహార్తి తీర్చే మా రామయ్య మడుగు
ఎన్నో మరెన్నో జ్ఞాపకాల నిలయం
నేడో మడుగు చోట బహుళంతస్తుల భవనాలు
తాతయ్య అమ్మమ్మ చివరికి అమ్మలక్క లేదు
మడుగన్నది కాన రాలేదు
పంట పొలాలు కనుమరుగయిన వేళ
నాలో నేను డెబ్బది సంవత్సరాల వయస్సులో అనుకున్నా
నన్నయ్య చెప్పిన 'గతకాలమే మేలు వచ్చు కాలం కంటెన్' అన్నది అక్షర సత్యం అన్నది..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి