ద్రోణ పర్వము పంచమాశ్వాసము: 362 వ రోజు
వ్యాసుడు అశ్వత్థామకు నరనారాయణుల గురించి వివరించుట
అశ్వథ్థామ కొంత దూరం పోగానే వ్యాసుడు ఎదురు వచ్చాడు. అశ్వత్థామ వ్యాసమహామునికి వినయంగా నమస్కరించి " మునీంద్రా ! నాదొక సందేహం నేను సంధించిన ఆగ్నేయాస్త్రం మహిమాన్వితమైంది. దేవదానవులు, గంధర్వులు కూడా దాని ముందు నిలువలేరు. కాని సామాన్యమానవులైన కృష్ణార్జునులను అది ఏమీ చేయ లేక పోయింది ఎందుకని " అని అడిగాడు. అందుకు వ్యాసుడు " ఓ అశ్వత్థామా ! పూర్వం నారాయణుడు లోకములు రక్షించుటకు నారాయణ మునిగా అవతరించాడు. నారాయణ ముని తపస్సు చేయుటకు మైనాక పర్వతానికి వెళ్ళాడు. అక్కడ శివుని గురించి ఘోర తపస్సు చేసాడు. ఆ తపస్సుకు మెచ్చి మహాశివుడు నారాయణునికి ప్రత్యక్షం అయ్యాడు. నారాయణుడు మహాశివుని అనేక విధముల స్తోత్రం చేసి " మహేశ్వరా ! నిన్ను ఎల్లప్పుడూ భక్తితో భజించు నాకు అనన్య సులభమైన ప్రభావము నొసగుము " అని అడిగాడు. అందుకు శివుడు సంతసించి నీవు, నర, సుర, గంధర్వ, గరుడ, కిన్నర, ఉరగ మొదలైన భూతకోటిని అవలీలగా గెలువగలవు. పరమ తేజోవిరాజమానుడవై ఉండగలవు. నీకు ఏ అస్త్రముతోగాని, శస్త్రముతోగాని, అగ్నితోగాని, జలముతోగాని, తడి వస్తువుతోగాని, పొడి వస్తువుతోగాని, స్థావరజంగములతోగాని, వజ్రాయుధముతోగాని బాధగాని చావుగాని ఉండవు. ఒక వేళ నేనే నీ మీదకు యుద్ధానికి వచ్చినా నన్ను కూడా జయింపగలవు " అని వరము ఇచ్చాడు. కనుక నారాయణుడు అజేయుడు. అశ్వత్థామా ! నారాయణుడు తపస్సు చేసుకుంటున్న సమయమున అతడి తేజస్సు నుండి పుట్టిన వాడు నరుడు. వారు నరనారాయణులుగా ప్రసిద్ధి చెందారు. వారిద్దరూ విష్వంశ సంభూతులు. వారిరువురు మహాఋషులు. నారాయణుడు తన లీలతో జగన్మోహనుడై విహరిస్తూ దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తుంటాడు. ఈ మహాత్ములు ఇద్దరూ దానవులను వధించుటకు ధర్మసంస్థాపనకు అవసరమనిపించినప్పుడల్లా అవతరిస్తుంటారు. నారాయణుడే కృష్ణుడు, నరుడే అర్జునుడు.*
అశ్వత్థామకు నరనారాయణులకు కల తారతమ్యము
ఓ అశ్వత్థామా! నీవు కూడా తపస్సు , తేజస్సు, విద్య, విభవము కలిగిన దేవతా మూర్తివే. నీకు నారాయణునికి కల అంతరమును చెప్తాను విను. నీవు మృత్తికతో ఒక మూర్తిని చేసి పరమాత్మను ఆవహింపజేసి అత్యంత భక్తితో నిష్టతో పూజించావు. కాని నారాయణుడు ఆ గౌరీపతిని లింగాకృతిలో పూజించారు. ఏవిధంగా పూజించినా సర్వకామ్య సాధకమే అయినా లింగాకృతిలో పూజించుట ప్రతిమా కృతిలో పూజించుట కంటే అనేక రెట్లు ఎక్కువ. కనుక పరమాత్ముని లింగాకృతిలో పూజించిన నరనారాయణులను ప్రతిమాకృతిలో పూజించిన నీవు గెలువ లేవు. మీరు గతజన్మలో సేసిన అర్చనలో కల తారతమ్యము వలన మీ మధ్య ఈ తేడా సంభవించింది కనుక అనుభవించక తప్పదు " అన్నాడు. అశ్వత్థామ పులకాంకితుడై మనసులో పరమేశ్వరుడిని భక్తితో ధ్యానించాడు. వ్యాసుడికి నమస్కరించి తిరిగి తన రథము వద్దకు వచ్చి రథము ఎక్కాడు. కాని అప్పటికే సాయం సమయం అయింది కనుక ఆ రోజుకు యుద్ధము చాలించమని సుయోధనుడికి చెప్పాడు. పాండవ సేనలు మంగళతూర్యములతో కౌరవసేనలు విషణ్ణవదనాలతో తమతమ శిబిరాలకు వెళ్ళారు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి